ఆ చట్టం తొలుత ఇక్కడే అమలు.. 

14 Dec, 2019 10:50 IST|Sakshi

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకోవడం ఎవరితరం కాదని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్ అన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బెంగాల్‌లోనే తొలుత ఈ చట్టం అమలు జరిగి తీరుందని వ్యాఖ్యానించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనో అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ చట్టంపై నిరసన వ్యక్తం చేస్తున్న ఈశాన్య రాష్ట్రాల ఆందోళనకారులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో దిలీప్‌ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడానికి గల కారణలేమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓటు బ్యాంకు గల్లంతవుతుందనే భయంతోనే ఆమె ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు.

‘మమత ఇదివరకు ఆర్టికల్‌ 370 రద్దు, నోట్ల రద్దును కూడా వ్యతిరేకించారు. అయితే కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయడాన్ని ఆపలేకపోయారు. ఇప్పడు కూడా అంతే.. మమతా బెనర్జీ గానీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ గానీ ఈ చట్టం అమలును అడ్డుకోలేరు. నిజానికి ఈ రాష్ట్రంలో తొలుత పౌరసత్వ సవరణ చట్టం అమలు జరుగుతుంది. అయినా మమతకు అక్రమవలసదారుల పట్ల ఉన్న ప్రేమ.. హిందూ శరణార్థుల పట్ల ఎందుకు లేదో అర్థంకావడం లేదు. అక్రమ వలసదారుల గురించే ఆమె బాధ పడుతున్నారు’ అని దిలీప్‌ ఘోష్ మమతను విమర్శించారు.

ఇక మరో బీజేపీ నేత కైలాశ్‌ విజయ్‌వర్గియా సైతం మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఖండించారు. ఆమె వ్యాఖ్యలు ఈశాన్య రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. కాగా  పార్లమెంటు ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది.   

మరిన్ని వార్తలు