తాజ్‌ వద్దకు తీసుకెళ్లినందుకు థ్యాంక్స్‌: ఇవాంకా

2 Mar, 2020 04:07 IST|Sakshi
సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఇవాంకా ట్రంప్‌ మార్ఫింగ్‌ ఫొటో

న్యూఢిల్లీ: నటుడు, గాయకుడు దిల్జిత్‌ దొసాంజ్‌ చేసిన ఓ ట్వీట్‌ ట్విట్టర్‌ను ఊపేస్తోంది. దీనికి కారణం ఆ ట్వీట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు రిప్లై ఇవ్వడమే. వివరాల్లోకి వెళితే.. ఇవాంకా ట్రంప్‌ ఇటీవల భారత పర్యటనలో తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె తాజ్‌మహల్‌ వద్ద దిగిన ఓ ఫొటోను దిల్జిత్‌ ఫొటోషాప్‌ ఉపయోగించి        మార్ఫింగ్‌ చేసి, ఇవాంకా పక్కన తన ఫొటో పెట్టుకున్నాడు. ‘నేనే తనను తాజ్‌మహల్‌ వద్దకు తీసుకెళ్లాను.. అంతకంటే ఏం చేయగలను ?’ అంటూ కామెంట్‌ పెట్టాడు.

దీనిపై ఇవాంకా స్పందిస్తూ.. ‘నన్ను తాజ్‌మహల్‌ వద్దకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు. దీన్ని నేనెప్పటికీ మరచిపోలేను.’ అంటూ రిప్లై ఇచ్చారు. దీనిపై దిల్జిత్‌ స్పందిస్తూ.. ‘ఓ మైగాడ్‌.. కృతజ్ఞతలు ఇవాంకా ! ఇది ఫొటోషాప్‌ చేసిన చిత్రం కాదని అందరికీ చెప్పేప్రయత్నం చేస్తున్నారు. ఈసారి లూథియానాకు రండి’ అన్నారు. దీనిపై మళ్లీ స్పందించిన ఇవాంకా ‘భారతీయ అభిమానులను అభినందిస్తున్నా’ అంటూ ఫొటోషాప్‌ చేసిన మరికొన్ని చిత్రాలను షేర్‌ చేశారు. తనపై ఫొటోషాప్‌ చేసిన ఫొటోలపై ఇవాంకా సీరియస్‌గా కాకుండా ఫన్నీగా స్పందించడంతో ట్విట్టర్‌లో నవ్వులు పూశాయి.


సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఇవాంకా ట్రంప్‌ మార్ఫింగ్‌ ఫొటోలు

మరిన్ని వార్తలు