‘అతేదైనా’ అనర్ధదాయకమే!

3 Apr, 2018 16:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో ఈ మధ్య న్యాయ వ్యవస్థ క్రియాశీలత రోజు రోజుకు పెరుగుతోంది. చట్ట సభలకు సంబంధించిన వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటోంది. ఆ మధ్య దేశంలోని నదుల అనుసంధానం గురించి స్వయంగా ఉత్తర్వులు జారీ చేయగా, ఆ తర్వాత దేశంలోని డీజిల్‌ కార్లపై నిషేధం విధించింది. క్రికెట్‌ పాలక మండలి బాధ్యతలను చేతుల్లోకి తీసుకొంది. ముంబైలో గోకుల అష్టమి సందర్భంగా మానవ పిరమిడ్‌లు 20 అడుగులు మించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టం దుర్వినియోగం అవుతోందని, అందుకు  ఈ చట్టం కింద అతి తక్కువ శిక్షలు పడడమేనని సుప్రీం కోర్టు చెబుతోంది.

అది అబద్ధం. ఎందుకంటే, టెర్రరిస్టుల వ్యతిరేక చట్టం కింద ఇంతకన్నా చాలా తక్కువ శిక్షలు పడుతున్నాయి. వరకట్న వ్యతిరేక చట్టం 498 ఏ చట్టం ఇంకా ఎక్కువ దుర్వినియోగం అవుతోంది. ఎస్సీ, ఎస్టీల చట్టానికి  వ్యతిరేకంగా సోమవారం దేశంలోని దళితులు బంద్‌ నిర్వహించడం, అది హింసాత్మకంగా మారడం, దాదాపు పది మంది మరణించడం తెల్సిందే. సుప్రీం కోర్టు అతి వల్లనే ఇది జరిగిందని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని సడలించక పోయినట్లయితే దళితుల ఆందోళన జరిగేది కాదు, అమాయకుల ప్రాణాలు పోయేవి కావు. జడ్జీలను జడ్జీలే నియమించుకునే చిత్రమైన ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ భారత్‌లో ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది.

ఇలాంటి న్యాయ వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇది చట్ట సభల పరిధిలోనిది, అది కార్యనిర్వహణ వ్యవస్థ పరిధిలోనిది, కనుక తాము జోక్యం చేసుకోమంటూ గతంలో తీర్పులు చెప్పిన సుప్రీం కోర్టు ఇప్పుడు అన్నింట్లో జోక్యం చేసుకోవడానికి కారణం ఏమిటో అంతు చిక్కడం లేదు. పార్లమెంటరీ, కార్యనిర్వహణా వ్యవస్థలు దేశంలో బలహీనపడ్డాయని భావించడం వల్లనా? బలమైన రాజకీయ పార్టీ అధికారంలో లేదని భ్రమించడం వల్లనా? తమ క్రియాలత్వానికి మరింత పదును పెట్టాలని భావించడం వలనా! ప్రజాస్వామ్య వ్యవస్థలో తమదే పైచేయని నిరూపించుకోవడానికా? ఎదేమైనా కొంత అతిగానే కనిపిస్తుంది.

>
మరిన్ని వార్తలు