నూతన సీజేగా రంజన్‌ గొగోయ్‌!!

1 Sep, 2018 19:36 IST|Sakshi
దీపక్‌ మిశ్రా (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అక్టోబర్‌ 2న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర న్యాయశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు నూతన సీజే నియామకం గురించి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అభిప్రాయాన్ని కోరుతూ లేఖ రాసింది. ఈ క్రమంలో నూతన సీజేగా సీనియర్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పేరును ప్రతిపాదిస్తూ మిశ్రా న్యాయశాఖకు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అక్టోబరు 3న రంజన్‌ గొగోయ్‌ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

సంప్రదాయాన్ని పాటిస్తూ...
కొలీజియం సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు జడ్జీల నియామకం జరుగుతోంది. సీనియారిటీ ప్రకారం జడ్జీల నియామకం జరిపే సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. కాగా ప్రస్తుతం ఉన్న జడ్జీల్లో రంజన్‌ గొగోయ్‌ సీనియర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో నూతన సీజేగా రంజన్‌ గొగోయ్‌ నియామకం లాంఛనప్రాయమే కానుంది. కాగా ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు రోస్టర్‌ (ఏ కేసును ఎవరు విచారించాలనే నిర్ణయం) కేటాయింపులు సమతూకంతో ఉండటం లేదని సీజేఐ దీపక్‌ మిశ్రాను వ్యతిరేకిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు జడ్జీల బృందంలో రంజన్‌ గొగోయ్‌ కూడా ఒకరు. ఈ సమావేశంలో జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌తో పాటు, జాస్తి చలమేశ్వర్, మదన్ బీ లోకూర్, కురియన్ జోసెఫ్‌లు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.


రంజన్‌ గొగోయ్‌

>
మరిన్ని వార్తలు