న్యాయ క్రియాశీలత సరికాదు

14 Dec, 2015 00:59 IST|Sakshi
న్యాయ క్రియాశీలత సరికాదు

తప్పుపట్టిన పార్లమెంటరీ కమిటీ
♦ కిందిస్థాయి కోర్టుల పనిని కూడా సుప్రీం, హైకోర్టులే చేస్తున్నాయి
♦ సీబీఐ దర్యాప్తులను నేరుగా పర్యవేక్షిస్తున్నాయి
♦ నిబంధనలకు విరుద్ధంగా రోజువారీ నివేదికలు కోరుతున్నాయి
♦ జిల్లాల్లో సీబీఐ ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో ద్వంద్వ న్యాయ వ్యవస్థ
 
 న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు అనేక కేసుల్లో జోక్యం చేసుకుంటూ, సీబీఐ దర్యాప్తులను నేరుగా పర్యవేక్షిస్తుండడం, దర్యాప్తు సంస్థకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడాన్ని పార్లమెంటరీ కమిటీ తప్పుపట్టింది. సుప్రీంకోర్టు సహా అనేక హైకోర్టులు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే కేసులను నేరుగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నాయని, ఈ తరహా న్యాయ క్రియాశీలత సరికాదని పేర్కొంది. నేర న్యాయ వ్యవస్థ ప్రకారం కిందిస్థాయి క్రిమినల్ కోర్టులు నిర్వర్తించాల్సిన విధులను సైతం పై స్థాయి కోర్టులే నిర్వర్తిస్తున్నాయని ఆక్షేపించింది. 

నేరశిక్షా స్మృతి 1973లోని సెక్షన్ 172, సెక్షన్ 173లను పక్కనపెట్టి, చాలా కేసుల్లో రోజువారీ దర్యాప్తు పురోగతిని వివరిస్తూ సీల్డ్ కవర్‌లో నివేదికలు ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తున్నాయంది. దీంతో  బాధితులు నేర న్యాయ వ్యవస్థలో తమకు ఉన్న హక్కులు, ఉపశమన అవకాశాలను కోల్పోతున్నారని వివరించింది. సిబ్బంది, ప్రజా ఇబ్బందులు, చట్టం, న్యాయ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఈ మేరకు తన నివేదికలో పేర్కొంది. 2జీ, బొగ్గు స్కాం, వ్యాపమ్ వంటి అనేక కేసులను సుప్రీంకోర్టు నేరుగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.

 సీబీఐ ప్రత్యేక కోర్టులపై..
 వివిధ జిల్లాల్లో సీబీఐ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడాన్ని కూడా పార్లమెంటరీ కమిటీ తప్పుపట్టింది. ఇది ద్వంద్వ న్యాయవ్యవస్థకు దారితీస్తుందని పేర్కొంది. ఇందుకు రాజ్యాంగం సమ్మతించబోదని తెలిపింది. ఇది ఇలాగే కొనసాగితే.. రాజ్యాంగం నిర్దేశించిన ‘పిరమిడ్’ నిర్మాణ తరహా పాలన కాస్త తలకిందులయ్యే ప్రమాదం ఉందని, వ్యవస్థల మధ్య అధికారాల సంఘర్షణకు దారి తీయొచ్చని, రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయొచ్చని ఆందోళన వ్యక్తంచేసింది. అన్ని కేసుల దర్యాప్తును సీబీఐకే అప్పగించడం వల్ల రాష్ట్ర పోలీసు విభాగాలు హోంగార్డుల స్థాయికే పరిమితమవుతాయని పేర్కొంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్(డీఎస్‌పీఈ) చట్టం-1946 ప్రకారం సీబీఐని నెలకొల్పారని, అయితే ప్రస్తుతం ఆ చట్టం పరిధిని దాటి సీబీఐ చాలా విసృ్తతమైందని తెలిపింది.

మరిన్ని వార్తలు