సీఏఏ, ఎన్‌ఆర్‌సీలతో దివ్యాంగులకు నష్టం

31 Dec, 2019 17:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల పట్టిక (ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా, అనుకూలంగా నేడు దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ చట్టాల వల్ల ఎక్కువగా నష్టపోనున్న ‘దివ్యాంగులు’ గురించి మాత్రం ఇటు ప్రజలుగానీ, అటు ప్రభుత్వంగానీ అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ రెండింటి వల్ల దివ్యాంగులే ఎక్కువగా భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న శరణార్థులు అవుతారని ‘నిప్మన్‌ ఫౌండేషన్‌’ సీఈవో, ‘వీల్స్‌ ఫర్‌ లైఫ్‌’ వ్యవస్థాపకులు నిపుణ్‌ మల్హోత్ర ఆందోళన వ్యక్తం చేశారు.

2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 2.21 శాతం మంది మాత్రమే దివ్యాంగులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 15 శాతం మంది దివ్యాంగులు ఉంటారు. ఆ లెక్కన భారత దేశంలో కూడా దాదాపు ఆ దరిదాపుల్లోనే ఉంటారు. సరైన సామాజిక స్పృహ లేనందున 2011 జనాభా లెక్కల సందర్భంగా చాలా కుటుంబాలు తమ కుటుంబంలోని దివ్యాంగుల గురించి వెల్లడించలేదు. జనాభా గణన అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు దివ్యాంగులను గదుల్లో బంధించిన సంఘటనలు కూడా ఆ తర్వాత వెలుగు చూశాయని నిపుణ్‌ మల్హోత్ర తెలిపారు. 

2018, జూన్‌ నెలలో కేంద్ర ప్రభుత్వం ‘యూనివర్శల్‌ డిసేబుల్డ్‌ ఐడీ కార్డ్‌’ స్కీమ్‌ను ఢిల్లీలో ప్రారంభించగా ఆ సంవత్సరం కేవలం 22 కార్డులను మాత్రమే కేంద్రం జారీ చేసింది. ఢిల్లీలో 2.3 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. ఇలా దేశంలో ఎంతో మంది దివ్యాంగులకు ఐడీ కార్డులు లేవని, వారందరిని కొత్త చట్టాల కింద అక్రమంగా దేశానికి వలసవచ్చిన శరణార్థులుగా పరిగణించే ప్రమాదం ఉందని మల్హోత్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు