నడవలేదన్నారు.. పరుగెడుతోంది!

7 Nov, 2015 10:58 IST|Sakshi
నడవలేదన్నారు.. పరుగెడుతోంది!

ఆమెకు పరుగంటే ఇష్టం.. ఆగకుండా జీవితాన్ని పరుగుపెట్టించడమంటే ఇష్టం.. కాళ్లున్నా లేకున్నా సరే..! నాలుగు గోడల మధ్యా కాలక్షేపం చేయడం ఆమెకు అలవాటు లేనిపని. బయటి ప్రపంచాన్ని చూడాలి. వీధుల్లో తిరగాలి. కాళ్లరిగేలా నడవాలి. అప్పటికీ అలసటొస్తే తనివితీరా పరుగెత్తాలి.. ఇదీ ఆమె తీరు. కానీ, ఓ దురదృష్టకర క్షణాన ఆమె నడవడం సాధ్యం కాదన్నారు. ఆమె వైపు జాలిగా చూశారు. అంతే.. ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. శక్తులు కూడదీసుకుంది. విధి వెక్కిరిస్తేనేం..? కాళ్లు పనిచేసినన్ని రోజులూ ఆమె జింకపిల్ల, పనిచేయనంటూ అవి మొండికేసిన రోజున ఆమె చిరుతపులి.

 
కొన్ని వందల పుస్తకాలు చదివినా దొరకని స్ఫూర్తి, ప్రేరణ.. దీపా మాలిక్‌ను చూడగానే కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఎనలేని ఉత్తేజం ఆమె సొంతం. దీపా మాలిక్ దేశంలోనే అత్యుత్తమ మహిళా బైక్‌రేసర్, స్విమ్మర్, అంతర్జాతీయ స్థాయి అథ్లెట్, సాహస క్రీడాకారిణి. జాతీయ, అంతర్జాతీయ పతకాలు, లిమ్కా బుక్ రికార్డులు ఆమె స్థాయి ఏంటో చెబుతాయి. క్రమశిక్షణకు మారుపేరైన ఆర్మీ కుటుంబ నేపథ్యంలో పెరిగిన దీపా ఈ ఘనతలు సాధించడం పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ, ఆమె ఓ వికలాంగురాలు అని తెలిస్తే మాత్రం చిరు విజయం కూడా కొండంతగా కనిపిస్తుంది. అయితే, ఆమె చిరు విజయాలతో సంతృప్తి చెందే రకం కాదు. శిఖర సమాన ఘనతలు సాధించనిదీ నిద్రను కూడా దరిచేయనీయని మొండిఘటం.
 
 సాహసమే ఊపిరి..
45 ఏళ్ల దీపా మాలిక్ చిన్ననాటి నుంచీ సాహసాలే ఊపిరిగా బతికింది. అందరు చిన్నారులూ ఊయలపై కూర్చొని ఆనందిస్తే.. దీపా మాత్రం వేగంగా ఊగే ఊయలపై నిల్చొని కేరింతలు కొట్టేది. బైక్‌లంటే ఆమెకు ఎనలేని ఆసక్తి. ఆ ఆసక్తితోనే పెళ్లికి ఒప్పుకున్నారామె. 20 ఏళ్ల వయసులో ఆమె తండ్రి ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. దీపా మొదలే చిచ్చరపిడుగు. పెళ్లికి అంత ఈజీగా అంగీకరించే రకం కాదు. అయితే, వరుడు కూడా బైక్ ప్రియుడే. దీపా ఆసక్తిని తెలుసుకుని ఆమెను ఉత్సాహపరిచాడు. ఓ బైక్ కూడా కొనిస్తానని చెప్పాడు. దీంతో ఆమెకు నో చెప్పడానికి పెద్దగా కారణాలు దొరకలేదు. తన తండ్రిలాగే అతడూ సైన్యంలో పనిచేయడం దీపాకు నచ్చింది. ఇంకేముంది పెళ్లి బాజా మోగింది. అనుకున్నట్టుగానే బైక్ కొనిచ్చాడు ఆమె భర్త. కొత్త దంపతులు అన్యోన్యంగా జీవించారు. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు.
 
 కుదుపు..
 ప్రేమ, సాహసాల సంగమంగా సాగుతోన్న వారి జీవితంలో 1999లో పెద్ద కుదుపు వచ్చినట్టయింది. దీపాకు వెన్నుముక సంబంధ కణితి ఉన్నట్టు తెలిసింది. వైద్యులు మూడుసార్లు శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని తొలగించారు. అయితే, ఆమె నడుం కిందిభాగం మాత్రం చచ్చుబడిపోయింది. ఆమె కాళ్లు పూర్తిగా స్పర్శరహితంగా మారిపోయాయి. ఓ వైపు ఆమె భర్త కార్గిల్ యుద్ధంలో శత్రువులతో పోరాడుతున్నాడు. మరోవైపు దీపా అనారోగ్యంతో..! ఆమె కన్న కలలు నీరుగారిపోయాయి. తనకిష్టమైన బైకింగ్, స్విమ్మింగ్, సాహస క్రీడలు.. ఏవీ ఇకపై చేయలేవంటూ వైద్యులు తెలిపారు. ఈ సమయంలో మరణమే శరణ్యమనుకుంది. కానీ, పసితనంలో ఉన్న తన ఇద్దరు బిడ్డలు ఆమెకు గుర్తుకువచ్చారు. యుద్ధక్షేత్రంలోని భర్త ప్రాణాలతో తిరిగివస్తాడో, లేదో తెలీదు. తను కూడా దూరమైతే వారేమైపోతారోనని భయపడింది. ఆ భయమే ఆమెను ధైర్యంగా బతికేలా చేసింది.

అథ్లెటిక్స్‌లో..
బైకింగ్ మాత్రమే కాక, స్విమ్మింగ్‌లోనూ ప్రతిభ కనబర్చిన ఆమె మనదేశం తరఫున పారా ఒలింపిక్ ప్లేయర్‌గా ఎంపికైంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వికలాంగ మహిళగా గుర్తింపు పొందింది. 2012లో రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డునూ అందుకుంది. స్విమ్మింగ్, జావెలిన్ త్రో, షాట్‌పుట్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనలు చేసింది. వైకల్యం అనేది ఓ మానసిక అడ్డంకి మాత్రమేనని నిరూపించింది. మరీ ముఖ్యంగా నాలుగు పదుల వయసులో సాధారణ రేసర్లతో సమానంగా ఆమె పోటీ పడేతీరు నిజంగా ఓ అద్భుతమే. ప్రస్తుతం 2016 రియో పారా ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతోన్న దీపా.. వారాంతాల్లో బైక్ రేసింగ్, సాహస క్రీడల్లోనూ పాల్గొంటోంది. తనలాగే వైకల్యంతో బాధపడేవారందరికీ వారందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
 
36 ఏళ్ల వయసులో..
కార్గిల్ యుద్ధం ముగిసింది. దీపా మానసిక సంఘర్షణ కూడా..! భార్యాభర్తలిద్దరూ గెలిచారు. క్షేమంగా ఇంటికి చేరుకున్న భర్త.. దీపా మాలిక్‌కు అండగా నిలిచాడు. అంతులేని ప్రేమ కురిపించాడు. దీంతో మానసికంగా కుదుటపడింది. అయితే, వీల్‌చైర్‌కే పరిమితం కావడం ఆమెకు ఎంతమాత్రమూ నచ్చలేదు. బైక్‌పైన రువ్వుమంటూ దూసుకెళ్లాలని కోరుకునేది. అదే విషయాన్ని భర్తకు చెప్పింది. ఎన్నో కష్టాలు, వ్యయప్రయాసలకు ఓర్చి నాలుగు చక్రాల బైక్‌ను సొంతం చేసుకుంది. రేసింగ్ లెసైన్స్ కూడా సంపాదించింది. అలా 36 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించింది. అప్పటి నుంచీ ప్రమాదకర పర్వత ప్రాంతాలు, కొండలోయలు, హైవేలు.. ఇలా ప్రతిచోటా రేసుల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే నాలుగు లిమ్కా బుక్ రికార్డులు తన ఖాతాలోకి వేసుకుంది.

మరిన్ని వార్తలు