కరోనా హాట్‌స్పాట్స్‌ సీల్‌..

8 Apr, 2020 15:30 IST|Sakshi

లక్నో : కరోనావైరస్‌ కేసులు అధికంగా నమోదైన యూపీలోని 15 జిల్లాలనూ ఏప్రిల్‌ 15 వరకూ దిగ్బంధం చేస్తామని అధికారులు ప్రకటించారు. హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు, సేవలను ఇంటింటికీ చేరవేస్తామని తెలిపారు. గౌతంబుధ్ధ్‌నగర్‌, ఘజియాబాద్‌, మీరట్‌, ఆగ్రా, షమ్లి, సహరన్‌పూర్‌ సహా 15 జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక కరోనా పాజిటివ్‌ కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కనీసం ఏప్రిల్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం ఉందని సీనియర్‌ అధికారులు పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మూడువారాల లాక్‌డౌన్‌ ఈనెల 14తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అత్యధిక​ కేసులు నమోదు కావడం, 2 కోట్ల జనాభా కలిగిన ముంబై సిటీ కరోనా మహమ్మారికి ప్రధాన కేంద్రంగా మారుతుండటంతో మహానగరంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ముంబైలో ఇప్పటివరకూ 300కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 50 మంది మరణించారు. ఇక గోవాలోనూ లాక్‌డౌన్‌ను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. (ఐసోలేషన్ వార్డులుగా మరిన్ని రైల్వే బోగీలు )

మరిన్ని వార్తలు