నేను తిరిగి వచ్చేశా: శివకుమార్‌

24 Oct, 2019 08:03 IST|Sakshi

న్యూఢిల్లీ : కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. తనకు బెయిల్‌ వచ్చిందని... తిరిగి వచ్చేశానని పేర్కొన్నారు. మనీ ల్యాండరింగ్‌ కేసులో అరెస్టై తీహార్‌ జైలులో ఉన్న శివకుమార్‌కు షరతులతో కూడిన బెయిలు లభించిన విషయం తెలిసిందే. పాసుపోర్టును అప్పజెప్పడంతో పాటు రూ.25 లక్షల పూచీకత్తు సమర్పించాలని, ఈడీ విచారణకు సహకరించాలని బెయిలు మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు శివకుమార్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతఙ్ఞతలు తెలిపారు. జైలులో తనను కలిసి... ఆమె తనలో ధైర్యాన్ని నింపారని పేర్కొన్నారు. 

కాగా బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జైల్లో ఉన్న డీకే శివకుమార్‌ను కలిసిన విషయం విదితమే. అనంతరం ఆమె మాట్లాడుతూ డీకే శివకుమార్‌ చాలా ధైర్యవంతుడని అన్నారు. న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందన్నారు. ఇక గురువారం శివకుమార్‌ రాక సందర్భంగా బెంగళూరులో విజయోత్సవం జరపాలని అభిమానులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా మనీ ల్యాండరింగ్‌ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరుగనుంది. ఇక కర్ణాటకలో అత్యంత సంపన్న నేతగా గుర్తింపు పొందిన శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీ ల్యాండరింగ్‌ కేసులో సెప్టెంబరులో అరెస్టైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివకుమార్‌తో పాటు ఆయన కూతురు ఐశ్వర్యను కూడా ఈడీ విచారించింది.

మరిన్ని వార్తలు