జలం కోసం నిరసన గళం

24 Jun, 2019 11:19 IST|Sakshi

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిపై డీఎంకే ఆందోళన బాటపట్టింది. చెన్నైలో సోమవారం డీఎంకే ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చపాక్‌ స్టేడియం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో డీఎంకే శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నీటి సమస్యను పరిష్కరించడంలో పాలక ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని డీఎంకే నేతలు పాలక పార్టీపై విరుచుకుపడ్డారు.

చెన్నైలో నగర ప్రజలతో పాటు ఐటీ కంపెనీలు, వివిధ పరిశ్రమలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తమిళనాడులో నీటి ఎద్దడిపై డీఎంకే సభ్యుడు టీఆర్‌ బాలు లోక్‌సభలో నోటీసు ఇచ్చారు. కాగా చెన్నైలో నీటి సమస్యను అధిగమించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. జోలార్‌పేట్‌ నుం‍చి రైళ్ల ద్వారా రోజుకు 10 మిలియన్‌ లీటర్ల నీటిని ప్రభుత్వం తీసుకువస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి ఇప్పటికే ప్రకటించారు. కాగా చెన్నైలో తీవ్ర నీటికొరత నెలకొనడంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు