ఇక ‘డీఎన్‌ఏ’ ఆధారిత డైట్‌

12 Aug, 2019 15:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మందులు మనకు ఆహారం కారాదు. ఆహారమే మనకు మందు కావాలి’ ఇది మనకు ఆధునిక ఆరోగ్య సూత్రం. అవి, ఇవి అనకుండా అడ్డమైన గడ్డి తిని లేని రోగాలు తెచ్చుకొని మందులు తింటూ బాధ పడేకన్నా..  ఏ మందులు అవసరం లేని, ఏ రోగాలు దరిచేరని మనకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆచితూచి తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పది కాలాలపాటు హాయిగా జీవించొచ్చట. అందుకేనేమో కియో డైట్‌, వీరమాచినేని డైట్‌ అంటూ మార్కెట్లో ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు వీటికి భిన్నంగా పూర్తి శాస్త్ర విఙ్ఞానపరంగా మరో డైట్‌ అమల్లోకి వస్తోంది.

అదే ‘పర్సనల్‌ న్యూట్రిషన్‌ డైట్‌ (వ్యక్తిగత పోషకాల ఆహారం)’. మన డీఎన్‌ఏను విశ్లేషించి జన్యుపరంగా సంక్రమించే జబ్బులేవో అంచనా వేసి, ఆ జబ్బులు రాకుండా నివారించ గలిగిన ఆహారం తీసుకోవడమే ఆ డైట్‌. ఈ డైట్‌ను ఆలోపతి వైద్యులే నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ పద్ధతి నార్వేలో ఊపందుకుంది. అక్కడకుగానీ, భారత్‌లోని డీఎన్‌ఏ సెంటర్లకుగానీ మన లాలాజలం తీసి పంపిస్తే చాలు మన డీఎన్‌ఏ జన్యుక్రమాన్ని విశ్లేషించి నివేదిక పంపిస్తారు. వచ్చే అవకాశం ఉన్న జబ్బులు గురించి కూడా విశ్లేషిస్తారు. ఉదాహరణకు ‘కార్డియో వాస్కులర్‌ డిసీసెస్‌’ వచ్చే అవకాశం ఉందంటే, మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ కన్నా చెడు కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌ కన్నా ఎల్‌డీఎల్‌) ఎక్కువ ఉన్నట్లయితే మాంసాహారానికి గుడ్‌బై చెప్పి సాత్విక ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. చేపలు పుష్కలంగా తినొచ్చు. ‘ఫుడ్‌ ఫర్‌ మీ రీసర్చ్‌ ప్రాజెక్ట్‌’ కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఆహార పోషకాలను నిర్ధారించుకోవాలి. అందుకోసం అవసరమైతే డైటీషియన్‌ దగ్గరకు వెళ్లాలి.

మానవ శరీరంలో దాదాపు ఐదు లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుందని, మనం తినే ఆహార పదార్థాల్లో ఎక్కువ భాగం వాటికే పోతుందని ‘పర్సనలైజ్డ్‌ న్యూట్రిషన్‌’ పరీక్షల్లో బయటపడడంతో ఈ కొత్త డైట్‌ విధానం అవసరం అని వైద్యులు తేల్చారు. మనం తినే ఆహారాన్ని బట్టి మన పెద్ద పేగులో బ్యాక్టీరియా రకాలు మారుతాయని కూడా ఆ అధ్యయనంలో తేలింది. మనం సరైన డైటింగ్‌ చేయడం ద్వారా కొన్ని రకాల బ్యాక్టీరియాలను చంపేయవచ్చట. అంటే వాటిని చంపడానికి వేరే మందులు అవసరం లేదన్న మాట. అందుకనే ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి డీఎన్‌ఏను తప్పనిసరిగా విశ్లేషించి డేటాను నిక్షిప్తం చేయాల్సిందిగా ‘జాతీయ ఆరోగ్య సేవల ప్రాజెక్ట్‌ ’ అధికారులకు బ్రిటన్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు