దేశవ్యాప్తంగా డీఎన్‌ఏ డేటా బ్యాంకులు

14 May, 2018 05:08 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో డీఎన్‌ఏ డేటా బ్యాంకులను కేంద్రం త్వరలోనే ఏర్పాటు చేయనుంది. నిబంధనలకు విరుద్ధంగా పౌరుల డీఎన్‌ఏ వివరాలను బయటకు వెల్లడిస్తే మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ డీఎన్‌ఏ ముసాయిదా బిల్లును రూపొందించింది. డీఎన్‌ఏ ప్రొఫైల్స్, డీఎన్‌ఏ శాంపిల్స్, రికార్డులను బాధితులు, నిందితులు, అనుమానితులు, తప్పిపోయినవారు, మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తుల్ని గుర్తించేందుకు మాత్రమే వాడతామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ బిల్లు రూపకల్పనలో న్యాయశాఖ బయోటెక్నాలజీ విభాగం సలహాలను తీసుకుందన్నారు. ఈ ముసాయిదా బిల్లుకు ప్రస్తుతం న్యాయశాఖ తుదిరూపు ఇస్తోందన్నారు. డీఎన్‌ఏ సమాచారాన్ని అక్రమంగా కోరేవారికి కూడా మూడేళ్ల జైలుశిక్షతో పాటు లక్ష వరకూ జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. వచ్చే సమావేశాల్లో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఇటీవల కేంద్రం సుప్రీంకు తెలిపిందన్నారు. 

మరిన్ని వార్తలు