రైల్వే ప్రైవేటీకరణను అంగీకరించం

29 Apr, 2015 01:44 IST|Sakshi
రైల్వే ప్రైవేటీకరణను అంగీకరించం

 ప్రభుత్వ సంస్థలను
 నిర్వీర్యం చేసేందుకే
 ఎఫ్‌డీఐలకు అనుమతి

     కేంద్రం దిగిరాకపోతే సమ్మె
     సౌత్ సెంట్రల్ రైల్వే
     ఎంప్లాయీస్ సంఘ్ హెచ్చరిక
     జంతర్‌మంతర్‌లో ఆందోళన

 
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ఎన్డీఏ సర్కార్ ఎఫ్‌డీఐలను అనుమతిస్తోందని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆరోపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రైల్వేలో ప్రైవేటీకరణను అంగీకరించబోమని సంఘ్ సభ్యులు స్పష్టం చేశారు. రైల్వేలో ఎఫ్‌డీఐలను అనుమతించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్  సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ దాసరి భుజంగరావు అన్నారు.


కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, ఎన్‌ఎఫ్‌ఐఆర్‌తోపాటు  ఏఐడీఈఎఫ్, పోస్టల్, ఇన్సూరెన్స్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు పార్లమెంట్ స్ట్రీట్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేశారు. రైల్వేలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, రెల్వేలోకి పీపీఏ, ఎఫ్‌డీఐలను అనుమతించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని భుజంగరావు అన్నారు.


ఏడో పే కమిషన్‌ను 1-1-2014 నుంచి ఇవ్వడం, కొత్త పింఛన్ విధానం రద్దు, బోనస్‌పై సీలింగ్ విధానం ఎత్తివేత, వందశాతం డీఏను బేసిక్‌లో కలపడం, రైల్వేలో ఖాళీల భర్తీ, కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైన సిబ్బంది భర్తీ సహా మొత్తం 64 డిమాండ్లను కేంద్రం ముందుంచారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎఫ్‌డీఐలను అనుమతించాలన్న నిర్ణయంపై మోదీ సర్కార్ పునరాలోచించలేకపోతే రైల్వే, పోస్టల్, డిఫెన్స్, బీమా సంస్థల ఉద్యోగులు ఆందోళనలు ఉధృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.  కేంద్రం దిగిరాకపోతే నవంబర్ 23 నుంచి నివరధిక సమ్మె చేపట్టాలని నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిర్ణయించింది.


సమ్మె తర్వాతి పరిణామాలకుమోదీ సర్కారే బాధ్యత పడాల్సి ఉంటుందని సౌత్‌సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ హెచ్చరించారు. ఆందోళనలో  సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జాయింట్ జనరల్ సెక్రెటరీ రాజగోపాల్, డిప్యూటీ డివిజనల్ సెక్రెటరీ ఎన్‌వీఎన్ చౌదరి, మీడియా రీజినల్ కో ఆర్డినేటర్ రవి శంకర్ ముక్తేవి, వికారాబాద్ బ్రాంచ్ సెక్రెటరీ వీడీ ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఎస్. నర్సింహులు, పి.సత్యకుమార్‌రెడ్డి, మధుసూధన్, ప్రవీణ్‌తోపాటు మూడు వేల మంది సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు