జడ్జీలను వివాదాల్లోకి లాగకండి

29 Feb, 2020 01:04 IST|Sakshi

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా

న్యూఢిల్లీ: ‘ఎవరి గురించైనా నాలుగు మంచి మాటలు చెబితే.. కొంతమందికి నచ్చడం లేదు’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా వ్యాఖ్యానించారు. ‘జడ్జీలను వివాదాల్లోకి లాగకండి’ అని చమత్కరించారు. ఇటీవల జరిగిన ఒక అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోదీని జస్టిస్‌ మిశ్రా ప్రశంసించడంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ల్యుటెన్స్‌ఢిల్లీ ప్రాంతంలోని ఖాన్‌ మార్కెట్‌ ఎదురుగా ఉన్న పాఠశాలను సీజ్‌ చేయడంపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా శుక్రవారం జస్టిస్‌ మిశ్రా పై వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని సుసంపన్న ప్రాంతాల్లో ఖాన్‌ మార్కెట్‌ ప్రాంతం ఒకటి. విచారణ సందర్భంగా  సీనియర్‌ న్యాయవాది ఏఎం సింఘ్వీతో జస్టిస్‌ మిశ్రా.. ‘మీరు కూడా ఖాన్‌ మార్కెట్‌ దగ్గర్లోనే నివసిస్తున్నారు కదా! ఆ ప్రాంతంలో సంపన్నులు  ఉంటారు’ అన్నారు. దానికి సింఘ్వీ.. ‘నేను 30 ఏళ్ల క్రితమే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయాను. ఖాన్‌ మార్కెట్‌ అనేది ఇప్పుడు తప్పు పదంగా మారింది. అయినా ఆ ప్రాంతంలో మంచి కాఫీ షాప్స్‌ ఉన్నాయి. జడ్జీలు కూడా ఖాన్‌ మార్కెట్లో షాపింగ్‌ చేస్తుంటారు’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి స్పందిస్తూ.. ‘జడ్జీలను వివాదాల్లోకి లాగకండి’ అని చమత్కరించారు.

మరిన్ని వార్తలు