ఒక జననం : ఒక మరణం

17 Jan, 2019 11:01 IST|Sakshi

కోలకతా: సృష్టికి ప్రతిసృష్టి చేసే బ్రహ్మ వైద్యుడు అని ప‍్రతీతి. ఈ అంశాన్ని మరోసారి నిరూపించిన ఒక వైద్యుడు...అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. నిర్జీవంగా పడివున్న అపుడే పుట్టిన నవజాత శిశువుకు ప్రాణంపోసిన  వైద్యుడు బిభాస్‌ ఖుతియా(48) లేబర్‌ రూంలోనే కుప్పకూలిపోవడం,  క్షణాల్లో ఊపిరి ఆగిపోవడం పలువురిని కలవరపర్చింది. పశ్చిమ బెంగాల్‌లోని  ఈస్ట్‌మిడ్నాపూర్‌ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 
 
పురిటినొప్పులతో సోనాలి మాజి ఆరోగ్యం కేంద్రానికి  వచ్చింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న డాక్టర్‌  బిభాస్‌ ఆమెకు ప్రసవం చేశారు.  కానీ పుట్టిన బిడ్డలో చలనం లేకపోవడంతో తక్షణమే వైద్యం అందించి  పాపకు ఊపిరి పోశారు. దీంతో కోలుకున్న శిశువు ఏడవడం మొదలు పెట్టడంతో వూపిరి పీల్చుకున్నారు.  కానీ అంతలోనే తీవ్రమైన గుండెనొప్పితో  బిభాస్‌ కుప్పకూలిపోయారు. వెంటనే నర్సు పరోమి బెరా ఇతర సిబ్బంది ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే  ఆయన  చనిపోయారని  వైద్యులు ధృవీకరించారు.  
 
పటిండాలో పీహెచ్‌సీలో గత 15ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. డా. బిభాస్‌ ఖుతియా.  ఆరోగ్యంకేంద్రంలో సిబ్బంది కొరతతో వున‍్న సందర్భంలో బిభాస్‌ 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉంటూ,  సేవలందించే వారని సిబ్బంది  కన్నీటి పర్యంతమయ్యారు. గతంలోనే యాంజియో గ్రామ్‌ చేసుకోవాల్సిందిగా  వైద్యులు సూచించినప్పటికీ ఆయన నిర్లక్ష్యం చేశారనీ, అదే ఆయన ప్రాణాలు తీసిందని వాపోయారు. మరోవైపు బిభాస్‌ అకాల మరణంపై జిల్లా  వైద్యశాఖ ముఖ్య అధికారి నిటాయ్‌ చంద్ర మండల్‌ సంతాపం వ్యక్తం చేశారు. చాలా నిబద్ధతతో విధులను నిర్వహించేవారని గుర్తు చేసుకున్నారు. వృత్తిపట్ల ప్రేమ, నిబద్ధత ఉండటం ఎంత అవసరమో.. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అంతే ముఖ్యమని ఆయన మరణం నిరూపించిందని వ్యాఖ్యానించారు

మరిన్ని వార్తలు