కరోనా: జులైలో మరీ ఎక్కువ

11 May, 2020 07:30 IST|Sakshi

తమిళనాడుకు భారీ తాకిడి

ఆ తర్వాత తగ్గుతుందని వెల్లడి 

ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటనతో ఆందోళన 

కరోనా వైరస్‌ జూలైలో తారస్థాయికి చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని వెల్లడించింది. ఈ పెనుముప్పు నుంచి బయటపడడం ఎలాగోనని స్థానికులు హడలిపోతున్నారు.  

సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్‌ మరింత విజృంభించనుందా...? మున్ముందు మరింత మందికి సోకే ప్రమాదం ఉందా..? అంటే అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆ సంస్థ రాయబారి డేవిడ్‌ నబరే విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల్లో తమిళనాడు గురించి ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఆయన ఏమన్నారంటే. భారత్‌లో కరోనా వైరస్‌ కట్టడయ్యేందుకు ముందు జూలైలో ఉచ్చస్థితికి చేరుకుంటుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతాయి. (వైద్యుడి కుటుంబంతో అమానుషంగా ప్రవర్తించిన గ్రామస్తులు)

ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పాజిటివ్‌ కేసులు పెరిగినా వైరస్‌ వ్యాప్తి స్థిరంగా ఉంటుంది. భారత్‌ అత్యంతవేగంగా కట్టుబాటు చర్యలను అమల్లోకి తెచ్చినందున వైరస్‌ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయగలిగారు. జనాభా అత్యధికంగా ఉండే భారత్‌లో వైరస్‌ కట్టడి చేయడం ఎంతో కష్టం. భారత్‌లో లాక్‌డౌన్‌ చర్య ఎంతో మంచి ఫలితాలను ఇచ్చింది. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడులో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. భారత్‌లో ప్రస్తుతం వేసవి నడ వడం ఎంతో మంచిది. ఎండ వేడిమి వల్ల వైరస్‌ వేగంగా వ్యాపించదు అని తెలిపారు.  

తమిళనాడుపై కోయంబేడు పోటు  
వైరస్‌ వ్యాప్తి విశ్వరూపాన్ని ప్రదర్శించి కోయంబేడు మార్కెట్‌ 2,167 మందిని బా«ధితులుగా మార్చింది. పొరుగు జిల్లాల నుంచి వచ్చే హోల్‌సేల్, రిటైల్‌ కూరగాయల వ్యాపారులు భౌతికదూరం పాటించడంలో నిర్లక్ష్యాన్ని చూపడం శాపంగా మారింది. కోయంబేడు మార్కెట్‌ వల్ల చెన్నైలో వెయ్యి మందికి, కడలూరులో 317, అరియలూరులో 239, విల్లుపురంలో 177, తిరువళ్లూరులో 124 ఇలా నలుచరగులా విస్తరణకు కోయంబేడు మార్కెట్టే కారణమైంది.   

కరోనా అప్‌డేట్స్‌ 
ఆదివారం నమోదైన కేసులు- 669
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు- 7,204
చెన్నైలో పాజిటివ్‌ కేసులు- 509
చెన్నైలో మొత్తం కేసులు- 3,839
యాక్టివ్‌ కేసులు- 5,195
మృతులు- 3
మొత్తం మరణాలు- 47

>
మరిన్ని వార్తలు