ఆ'పరేషన్' థియేటర్..

10 Jan, 2017 11:49 IST|Sakshi
ఆ'పరేషన్' థియేటర్..

థానే: ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం లోపిస్తే పేషెంట్లతో పాటు డాక్టర్లకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆపరేషన్ థియేటర్‌లోకి బొద్దింక రావడంతో డాక్టర్ తన సహనాన్ని కోల్పోయి కొద్దిసేపు ఆపరేషన్ ఆపేసి.. ఆస్పత్రిలో బొద్దింకలు తిరగడాన్ని మొబైల్లో చిత్రించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్ర థానేలో ఓ ఆస్పత్రిలో గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. కొన్ని నిమిషాల్లోనే పేషెంట్‌కు ఆపరేషన్ చేసి ఆస్పత్రిలో కొనసాగుతున్న పారిశుధ్యలోపాన్ని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదుచేశారు.

థానేలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ హాస్పిటల్‌లో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్‌గా డాక్టర్ సంజయ్ బరన్‌వాల్ పనిచేస్తున్నారు. గత శుక్రవారం కాలు ఫ్రాక్చర్ అయిందని 45 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన ఓ సీరియస్ కేసు ఆస్పత్రికి వచ్చింది. జూనియర్ డాక్టర్లతో కలిసి ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ బరన్‌వాల్ సర్జరీ చేస్తున్నారు. ఇంతలో కొన్ని బొద్దింకలు ఆ రూమ్‌లో తిరగడం ఆయన గమనించారు. అవి తమ ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయని కాసేపు ఆపరేషన్ నిలిపివేసి.. ఈ విషయాన్ని వీడియో తీశారు. ఆ తర్వాత విజయవంతంగా పేషెంట్‌కు సర్జరీ పూర్తిచేశారు.

500 పడకల సామర్థ్యం ఉన్న ఈ హాస్పిటల్‌ను థానే మునిసిపల్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్నారు. గతంలో తాను ఎన్నో పర్యాయాలు పారిశుద్ధ్యం అంశంపై ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. తమ సర్జరీలు సక్సెస్ అయినా వారిలో 25 శాతం షేషెంట్లకు కీటకాల కారణంగా ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నారని సీనియర్ సర్జన్ బరన్‌వాల్ మండిపడ్డారు. సిబ్బంది కొరతే వీటికి ప్రధాన కారణమని వివరించారు. హాస్పిటల్ డీన్ మైత్రాను ఈ విషయంపై సంప్రదించగా.. ఆమె నుంచి స్పందనరాలేదు.

మరిన్ని వార్తలు