అతని కడుపులో 452 లోహ వస్తువులు..

14 Aug, 2019 14:59 IST|Sakshi

అహ్మదాబాద్‌ : కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. అతని కడుపులో నుంచి 3.5 కిలోల బరువున్న 452 లోహ వస్తువులను వైద్యులు వెలికి తీశారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్‌కు ఈ నెల 8వ తేదీన కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో అక్కడి సిబ్బంది అతన్ని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ తొలుత ఎక్స్‌-రే నిర్వహించిన వైద్యులు.. అతని కుడి శ్వాసకోశంలో ఓ పిన్‌ చిక్కుకున్నట్టు గుర్తించి దాన్ని తొలగించారు. అయితే దాని తర్వాత తనకు తీవ్రమైన కడుపు నొప్పిగా ఉందని సదురు పేషెంట్‌ వైద్యులకు తెలిపాడు. 

దీంతో వైద్యులు అతనికి పూర్తి ఎక్స్‌-రే నిర్వహించారు. కడుపులో భారీగా వస్తువులు ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే అతన్ని ఆపరేషన్‌ థియేటర్‌కు తరలించారు. అక్కడ నలుగురు వైద్యులు బృందం రెండున్నర గంటల పాటు శ్రమించి అతనికి శస్త్ర చికిత్స పూర్తి చేసింది. అతని కడుపులో నుంచి మొత్తం 3.5 కిలోల బరువున్న పలు లోహ వస్తువులను వైద్యులు బయటకు తీశారు. అందులో కాయిన్స్‌, బోల్టులు, బ్లెడ్‌ ముక్కలు, ఒక నెల్‌ కట్టర్‌, ఒక స్పార్క్‌ ప్లగ్‌, ఒక లాకెట్‌ కూడా ఉన్నాయి. ఇలా మొత్తం 452 లోహ వస్తువులను బయటికి తీసినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం రోగిను వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని.. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వారు పేర్కొన్నారు. 

‘అతనికి చాలా కాలం క్రితమే వివాహం అయింది. ఆరేళ్ల పాప కూడా ఉంది. కానీ భార్య మాత్రం అతన్ని విడిచి వెళ్లిపోయింది. దీంతో అతడు మానసికంగా కుంగిపోయాడు. దీంతో అతన్ని ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో చేర్పించాం. గత మూడు నాలుగేళ్ల నుంచి అతను అక్కడే చికిత్స పొందుతున్నాడు. అతనికి ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచే ఇనుప వస్తువులను తినే అలవాటు ఉండేద’ని పేషెంట్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. 

మరిన్ని వార్తలు