ప్రపంచ భారీ బాలుడు.. బరువు తగ్గాడు

4 Jul, 2018 09:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత బరువైన బాలుడు మిహిర్‌ జైన్‌(237కిలోలు)కు వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా 60కిలోల బరువును తగ్గించారు. వ్యక్తుల ఎత్తు, బరువు ఆధారంగా బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎమ్‌ఐ) లెక్కిస్తారు. బీఎమ్‌ఐ విలువ 22.5గా ఉంటే సాధారణ వ్యక్తిగా, 32.5గా ఉంటే ఊబకాయుడిగా పరిగణిస్తారు. ఇలాంటి వారికి శస్త్ర చికిత్సను సిఫార్సు చేస్తారు. అయితే ఢిల్లీలోని ఉత్తర్ నగర్‌కు చెందిన మిహిర్ జైన్ (14) బాలుడు 237 కిలోల బరువు పెరగడంతో అతడి బీఎంఐ 92కు చేరింది. ప్రపంచంలోనే అత్యంత బరువైన టీనేజ్ ఊబకాయుడికి వైద్యులు గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. దీంతో మిహిర్‌ దాదాపు 60కిలోల బరువు తగ్గాడు.

నవంబర్‌ 2003లో పుట్టినప్పుడు మిహిర్ 2.5 కిలోలు బరువు ఉండేవాడు, కానీ క్రమంగా బరువు పెరుగుతూ ఐదేళ్ల నాటికి 60 నుంచి 70 కిలోలకు చేరుకున్నాడని తల్లి పూజా తెలిపారు. తమ కుటుంబంలో అందరూ బలంగానే ఉండటంతో దీన్ని అంతగా పట్టించుకోలేదని ఆమె తెలియజేశారు. అయితే కొద్ది కాలానికి లేచి నడవడానికి కూడా ఇబ్బంది పడటంతో 2వ తరగతి నుంచి స్కూల్‌ మాన్పించి, ఇంటి దగ్గరే పాఠాలు బోధించినట్టు పూజా పేర్కొన్నారు. 2010లో తొలిసారిగా వైద్య సాయం కోసం ప్రయత్నించాం కానీ, ఆపరేషన్‌కు తగిన వయసు కాదని వైద్యులు తిరస్కరించారని చెప్పారు. తక్కువ కేలరీల ఆహారం అందించాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు ఆహార కట్టడితో 40 కిలోలు తగ్గాడు. అనంతరం మ్యాక్స్‌ హాస్పిటల్‌ వైద్యులు గ్యాస్టిక్‌ బైపాస్‌ సర్జరీ చెసి బరువును తగ్గించారు.

దీనిపై డాక్టర్‌ ప్రదీప్‌ మాట్లాడుతూ.. మిహిర్‌ను తొలిసారి చూడగానే అతడికి శస్త్రచికిత్స విజయవంతమవుతుందనే నమ్మకం కలగలేదన్నారు. ‘శస్త్ర చికిత్సకు ముందు మాకు పూర్తి నమ్మకం కలగలేదు. అందుకే తక్కువ కేలరీల ఆహారం ముందు సిఫార్సు చేశాం. దీంతో అతని బరువు 196 కిలోలకు తగ్గింది. ఈ దశలో అతనికి సర్జరీ చేయాలని నిర్ణయించాం. విపరీతమైన స్థూలకాయం కారణంగా మిహిర్‌ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కారణంగా అతనికి సర్జరీ చేయడం కోసం ప్రత్యేక పరికరాలను ఉపయోగించవలసి వచ్చింది’  అని డాక్టర్‌ ప్రదీప్‌ చెప్పారు. డాక్టర్ల ప్రయత్నం వల్ల మిహిర్‌ సర్జరీ విజయవంతంగా జరిగింది. వారం రోజుల తరువాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన అతనికి పరిమిత ఆహారం తినాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం అతను 177 కిలోల బరువు ఉన్నాడు. అతని బరువును మూడేళ్లలో 100 కిలోలకు తగ్గించాలన్నది తమ లక్ష్యమని డాక్టర్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు