పరికరాల కొరతతో వైద్యుల ఆందోళన

4 Apr, 2020 15:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో కోవిడ్‌-19 బాధితులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్సలు అందిస్తున్న వైద్య సిబ్బందికే సరైన భద్రత లేకుండా పోయింది. గ్లౌజులు, మాస్క్‌లు, గౌన్లు, ఐ షీడ్ల కొరతతో వైద్యులతోపాటు ఇతర వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. హర్యానా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనాను తట్టుకునే గౌన్లు లేకపోవడంతో గతంలో హెచ్‌ఐవీ కోసం లె ప్పించిన గౌన్లనే వాడుతున్నారు. ఆ గౌన్లు రక్తం మరకలు అంటకుండా కాపాడుతాయటగానీ, నోటి, ముక్కు ద్వారా వెళ్లే వైరస్‌లను అడ్డుకోవట. వాటిని ప్రత్యేకంగా హెచ్‌ఐవీ కోసమే డిజైన్‌ చేసినవి కావడం వల్ల వాటితో ఇబ్బంది ఉందని హర్యానా ప్రభుత్వాస్పత్రిలో ఎనస్థెటిస్ట్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల మహిళా డాక్టర్‌ తెలిపారు. మాస్క్‌ల కొరత కూడా ఉండడంతే వాటిని ఉతుక్కొని మళ్లీ వేసుకుంటున్నామని ఆమె చెప్పారు. (కొవ్వొత్తుల తర్వాత రంగోలి పోటీలా!?)

గత 15 రోజులుగా తాను హెచ్‌ఐవీ గౌన్లనే వేసుకుంటున్నానని పాట్నా మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో పనిచేస్తున్న 28 ఏళ్ల డాక్టర్‌ తెలిపారు. పేరు బహిర్గతం చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఆ ఆస్పత్రిలో 29 కోవిడ్‌ అనుమానిత కేసులు ఉన్నాయి. వీటి కొరత వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 50 మంది వైద్య సిబ్బంది కోవిడ్‌ వైరస్‌ బారిన పడ్డారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలియజేసింది. వారిలో డాక్టర్లతోపాటు, నర్సులు, పార మెడిక్సి, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు. ముంబైలోని రెండు ఆస్పత్రుల్లో ముగ్గురు నర్సులకు కోవిడ్‌ సోకినట్లు తెల్సిందే. (ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌: మొయిలీ)

వ్యక్తిగత రక్షణ పరికరాలుగా వ్యవహరించే సరైన మాస్క్‌లు, ఓరాల్‌ సూట్లు లేవంటూ, ఉన్న కొద్దిపాటి మాస్క్‌లు కూడా నాసిరకమైనవని, ఎన్‌–95 కోవకు చెందిన  మాస్క్‌లు అసలు లేవంటూ ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తోన్న హిందూరావు ఆస్పత్రికి చెందిన 9 మంది వైద్యులు ఏప్రిల్‌ ఒకటవ తేదీన రాజీనామా చేశారు. అయితే ఆస్పత్రి యాజమాన్యం వారి రాజీనామాలను తిరస్కరించింది. చాలా ఆస్పత్రుల్లో స్థానికంగా అందుబాటులో ఉన్న సాధారణ ప్లాస్టిక్‌తో కుట్టించుకున్న గౌన్లను వాడుతుండడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సకాలంలో దేశం నుంచి వీటి ఉత్పత్తులను నిషేధించకపోవడం, అదనపు ఉత్పత్తుల కోసం సకాలంలో ఉత్తర్వులు జారీ చేయక పోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు