బెంగాల్‌లో కొనసాగుతున్న జూడాల ఆందోళన

16 Jun, 2019 17:40 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న జూనియర్‌ డాక్టర్ల ఆందోళన ఆరో రోజుకు చేరుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బందికి రోగుల నుంచి భద్రత కల్పించాలన్న తమ డిమాండ్‌ నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు పట్టుబడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆహ్వానం మేరకు చర్చలు జరపడానికి తాము సిద్ధమని పునరుద్ఘాటించారు. అయితే చర్చావేదిక ఎక్కడనేది గవర్నింగ్‌ బాడీలో చర్చించి తామే నిర్ణయం తీసుకుంటామన్నారు. కానీ, దానికన్నా ముందు  ఆందోళన జరుగుతున్న ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజ్‌ను సీఎం మమతా బెనర్జీ సందర్శించాలని వారు కోరుతున్నారు. నిన్న జరిగిన చర్చలు విఫలమైన అనంతరం మమత మాట్లాడుతూ డాక్టర్ల డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకుంటుందనీ, వారు వెంటనే విధుల్లోకి చేరాలని కోరారు. అలాగే వారిమీద ఎలాంటి చట్టాలను ప్రయోగించబోమనీ, అలా చేసి వారి భవిష్యత్తును ఇబ్బందిలో పెట్టదల్చుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై బెంగాల్‌ గవర్నర్‌ కె.ఎన్‌.త్రిపాఠి వైద్యుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మరోవైపు డాక్టర్ల ఆందోళన విషయంలో ఆదేశాలు జారీచేయడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్యసిబ్బంది భద్రతపై దేశం నలుమూలల నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖలు అందుతున్నాయి. వైద్యుల భద్రతకు తీసుకుంటున్న చర్యల గురించి తెలపాలని హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 

మరిన్ని వార్తలు