మిమ్మల్ని, దేశాన్ని, సృష్టికర్తను నమ్మండి

24 Feb, 2016 03:40 IST|Sakshi

లవ్లీ వర్శిటీ స్నాతకోత్సవంలో యువతకు  కామన్‌వెల్త్ ఆఫ్ డొమినికా ప్రధాని స్కెర్రిట్ పిలుపు

 జలంధర్: ప్రపంచాన్ని సానుకూలంగా ఎదుర్కోవడానికి మిమ్మల్ని, మీ దేశాన్ని, సృష్టికర్తను విశ్వసించాలని.. అప్పుడే ప్రతి ఒక్కరు ఒక ప్రధాని, సీఈవో, ప్రపంచ ప్రసిద్ధ ఎంట్రప్రెన్యూర్‌లు కాగలుగుతారని లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ) విద్యార్థులను ఉద్దేశించి కామన్‌వెల్త్ ఆఫ్ డొమినికా (నార్త్ అమెరికా) ప్రధాని రూజ్‌వెల్ట్ స్కెర్రిట్ పిలుపునిచ్చారు. యూనివర్సిటీలోని శాంతి దేవీ మిట్టల్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన వర్సిటీ ఆరో స్నాతకోత్సవంలో ప్రపంచంలోనే అత్యంత పిన్నవయసు ప్రధాని అయిన స్కెర్రిట్ పాల్గొన్నారు. స్కెర్రిట్ పాలనా దక్షతకు, ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి చేస్తున్న కృషికిగాను వర్సిటీ ఆయనకు ‘ఆనరిష్ కాసా డాక్టర్ ఆఫ్ లెటర్స్’ డిగ్రీని ప్రదానం చేసింది. అనంతరం పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి స్కెర్రిట్ మాట్లాడుతూ ఎల్‌పీయూలో అందుకున్న ఈ గౌరవాన్ని ఇరు దేశాల యువతకు అంకితం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.

విద్యార్థులు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పరస్పరం కలసి పనిచేయడానికి తాను భారత్‌లో ఎల్‌పీయూతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తితో ఎదురుచూస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2015 బ్యాచ్‌కు సంబంధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ను ప్రదానం చేశారు. మొత్తం 7,810 మంది విద్యార్థులు డిగ్రీలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డొమినికా రిపబ్లిక్ క్యాబినెట్ సెక్రటరీ స్టీవ్ ఫెర్కొల్, అజిత్ గ్రూప్ పబ్లికేషన్స్ చీఫ్ ఎడిటర్ పద్మ భూషణ్ డా.బర్జిందర్ సింగ్ హమ్దార్, లవ్లీ గ్రూప్ చైర్మన్ రమేష్ మిట్టర్, వైస్ చైర్మన్ నరేష్ మిట్టల్, ఎల్‌పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. స్కెర్రిట్ 31 ఏళ్ల వయసులో ప్రధాని పదవి చేపట్టారు.

మరిన్ని వార్తలు