నాకు హార్వే వెయిన్‌స్టీన్‌ అస్సలు నచ్చడు: ట్రంప్‌

25 Feb, 2020 20:53 IST|Sakshi

న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్‌ బడా నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్‌ను న్యూయార్క్‌ కోర్టు దోషిగా తేల్చడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వాగతించారు. న్యూయార్క్‌ కోర్టు ఇచ్చిన తీర్పును మహిళలు సాధించిన గొప్ప విజయంగా ట్రంప్‌ అభివర్ణించారు. భారత పర్యటనలో భాగంగా.. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌ ఈ విషయంపై స్పందించారు. ‘‘ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నందున ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోలేకపోయాను. బాధితుల పరంగా చూస్తే ఇది ఎంతో గొప్ప విజయం. ఈ తీర్పు శక్తిమంతమైన సందేశాన్ని అందిస్తుంది’’అని పేర్కొన్నారు. (విందు: ట్రంప్‌ మెనూలోని వంటకాలివే!)

ఇక గతంలో హార్వే వెయిన్‌స్టీన్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చిన ట్రంప్‌... హార్వే తనకు అస్సలు నచ్చడని మంగళవారం పేర్కొన్నారు. ప్రతిపక్ష డెమొక్రాట్లకు మాత్రం అతడు అత్యంత ప్రీతిపాత్రుడని విమర్శలు గుప్పించారు. అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్‌ ఒబామా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలి మహిళగా ఖ్యాతికెక్కిన హిల్లరీ క్లింటన్‌ హార్వేను ప్రేమిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ అందరికీ తెలుసు కదా.. నేను హార్వే వెయిన్‌స్టీన్‌కు చాలా దూరంగా ఉంటాను. అధ్యక్ష ఎన్నికల్లో నా ఓటమి కోసం కృషి​ చేస్తానని అతడు అందరికీ చెప్పాడు. కాబట్టి తనతో నాకు సత్సంబంధాలు లేవు. తను నాకు నచ్చడు. అయితే డెమొక్రాట్లకు హార్వే చాలా డబ్బు ఇచ్చాడు. అందుకే వాళ్లకు అతడంటే ఇష్టం. ముఖ్యంగా మిచెల్‌ ఒబామా, హిల్లరీ క్లింటన్‌లు అతడిని ప్రేమిస్తారు’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. (ఇండియాలో టారిఫ్‌లు ఎక్కువ: ట్రంప్‌)

కాగా హాలీవుడ్‌ మూవీ మొఘల్‌గా ప్రసిద్ధి గాంచిన హార్వే వెయిన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది నటీమణులు లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెయిన్‌స్టీన్‌ మీద కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ కేసులో వెయిన్‌స్టీన్‌ లైంగిక వేధింపుల‌కి పాల్ప‌డ్డాడ‌ని తేలడంతో.. ఆయనను వెంటనే జైలుకు తరలించాలని జడ్జి సోమవారం ఆదేశించారు. ఇక హార్వే ఉదంతం ప్రపంచవ్యాప్తంగా...‘మీటూ’ ఉద్యమానికి నాంది పలికిన విషయం తెలిసిందే. మీటూ కారణంగా పెద్దమనుషుల ముసుగులో చెలామణీ అవుతున్న ఎంతో మంది నిజస్వరూపం బట్టబయలైంది.(80 మందిని వేధించాడు.. జైలుకు వెళ్లాల్సిందే)

ట్రంప్‌ భారత పర్యటన: సమగ్ర కథనాల కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు