ఎయిర్‌పోర్ట్‌ టు స్టేడియం వయా సబర్మతి

25 Feb, 2020 06:23 IST|Sakshi
అహ్మదాబాద్‌లో ట్రంప్‌కు స్వాగతం పలుకుతున్న కళాకారులు

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తొలి భారత పర్యటన ఘనంగా ప్రారంభమైంది. ట్రంప్, ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు కుష్నర్‌ వచ్చిన ‘ఎయిర్‌ఫోర్స్‌ 1’ విమానం ఉదయం 11.37 నిమిషాలకు అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. బ్లాక్‌ సూట్‌లో ట్రంప్, వైట్‌ జంప్‌సూట్‌లో మెలానియా భారత గడ్డపై అడుగుపెట్టారు. ట్రంప్‌ రాకకు దాదాపు గంట ముందే మోదీ అహ్మదాబాద్‌ చేరుకున్నారు. విమానాశ్రయంలో ట్రంప్‌కు సాదర స్వాగతం పలుకుతూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మెలానియాకు ప్రేమగా షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. అక్కడి నుంచి వారు నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. దాదాపు పావుగంట పాటు గడిపిన అనంతరం, మొటేరా స్టేడియానికి బయల్దేరారు.  

రోడ్‌ షో
అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచే ట్రంప్‌ రోడ్‌ షో ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలుకుతూ రహదారులకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. దారి పొడవునా దాదాపు 22 కిమీ మేర వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ప్రత్యేకతలను వివరించేలా దాదాపు 50 వేదికలను ఏర్పాటు చేశారు. ఆ వేదికలపై ఆయా రాష్ట్రాల కళాకారులు తమ సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించారు. బ్లాక్‌ లిమోజిన్‌ ‘ది బీస్ట్‌’లో ప్రయాణిస్తూ ఈ రోడ్‌ షోలో ట్రంప్‌ పాల్గొన్నారు.

భద్రత
10 వేలకు పైగా పోలీసులు, ఎన్‌ఎస్‌జీ, ఎస్పీజీ దళాలు, అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు రోడ్‌ షో, ఆ తరువాత మొతెరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాలకు భద్రత కల్పించారు.  

‘మౌర్య’లో సంప్రదాయ స్వాగతం
ట్రంప్‌ దంపతులకు హోటల్‌ మౌర్య షెరాటన్‌లో సంప్రదాయ సిద్ధంగా స్వాగతం పలికారు. హోటల్‌లో అడుగుపెట్టగానే వారికి తిలకం దిద్ది, పూలగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. భద్రతాకారణాల రీత్యా వారు వెనకద్వారం గుండా లోనికి వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో వారు భోజనం చేశారని హోటల్‌ వర్గాలు తెలిపాయి. మౌర్యషెరాటన్‌లోని గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో ట్రంప్‌ బస చేశారు.  

నేడు చర్చలు
ఢిల్లీలో మంగళవారం ఉదయం నుంచి ట్రంప్‌ బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు అధికారిక స్వాగతం లభిస్తుంది. అక్కడి నుంచి ట్రంప్‌ దంపతులు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఆ తరువాత, ప్రధాని మోదీ, ట్రంప్‌ల నేతృత్వంలో హైదరాబాద్‌ హౌజ్‌లో భారత్, అమెరికాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య 300 కోట్ల డాలర్ల విలువైన డిఫెన్స్‌ డీల్‌తో పాటు ఐదు ఒప్పందాలు కుదిరే అవకాశముంది. మోదీ, ట్రంప్‌ చర్చల్లో పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. రక్షణ ఒప్పందంలో.. నౌకాదళం కోసం 24 ఎంహెచ్‌ 60ఆర్‌ రోమియో హెలీకాప్టర్లను, 6 ఏహెచ్‌64ఈ అపాచీ హెలీకాప్టర్లను భారత్‌ కొనుగోలు చేయనుంది. అనంతరం ట్రంప్‌ దంపతులు రాష్ట్రపతి కోవింద్‌ను కలుస్తారు. కోవింద్‌ ఇచ్చే విందులో  పాల్గొంటారు. ఆ తరువాత అమెరికాకు బయల్దేరి వెళ్తారు.

మరిన్ని వార్తలు