ట్రంప్‌ పర్యటన : మోదీకి ఐదు సూటి ప్రశ్నలు!

23 Feb, 2020 19:46 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించింది. ట్రంప్‌ పర్యటన భారత్‌కు ఏమేరకు లాభిస్తుందో చెప్పగలరా అని ఆ పార్టీ సీనియర్‌ నేత రణదీప్‌సింగ్‌ సుర్జేవాలా ట్విటర్‌ వేదికగా ఐదు ప్రశ్నలు వేశారు. అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందాలు, హెచ్‌ 1బీ వీసాలు, జాతీయ భద్రత, ఆయిల్‌ ధరలు, స్టీల్‌ ఎగుమతి అంశాలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
(చదవండి : భారత్‌కు పయనమైన అమెరికా అధ్యక్షుడు)

1.హెచ్‌ 1 బీ వీసాల జారీలో నిబంధనలు కఠినతరం చేశారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో 70 శాతం (85 వేలు) మందికి వీసాలు వచ్చేవి. 30 శాతం తిరస్కరణకు గురయ్యేవి. ట్రంప్‌ నిర్ణయాల వల్ల నేడు తిరస్కరణ మరో 24 శాతం పెరిగింది. ఈ పర్యటన తర్వాత హెచ్‌ 1 బీ వీసాల జారీని ట్రంప్‌ సరళతరం చేస్తారా?

2.1974 నుంచి భారత్‌కు ఉన్న ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ) 2019లో తొలగించారు. దీనివల్ల 5.6 బిలియన్‌ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడింది. నమస్తే ట్రంప్‌ కార్యక్రమం జీఎస్పీ పునరుద్ధరణకు దోహదం చేస్తుందా?

3.ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. వాటిల్లో ఇరాన్‌ నుంచి భారత్‌ చములు కొనుగోలు చేయొద్దని నిబంధన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ నుంచి భారత్‌ దిగుమతి నిలిపేస్తే.. ఆ స్థానంలో అమెరికా మనకు చమురు సరఫరా చేస్తుందా? ఇరాన్‌ నుంచి కాకుండా భారత్‌కు తక్కువ ధరకు చుమురును మోదీ తీసుకురాగలరా?

4.అమెరికా ప్రమోజనాలే తమకు తొలి ప్రాధాన్యం అని ట్రంప్‌ వాదిస్తుంటే.. భారత్‌కు తొలి ప్రాధాన్యం అన్న విధానంపై మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారు?

5. భారత్‌ ఎగుమతులపై అమెరికా టారిఫ్‌లు పెంచడం వల్ల 761 మిలియన్‌ డాలర్లుగా స్టీల్‌ ఎగుమతులు 50 శాతం మేర తగ్గిపోయాయి. అదే సమయంలో అమెరికా నుంచి మూడు బిలియన్‌ డాలర్ల రక్షణ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందానికి భారత్‌ సంసిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిఫలంగా భారత స్టీల్‌ ఎగుమతులపై అగ్రరాజ్యం ఏమైనా ప్రోత్సహకాలు కల్పిస్తుందా? అని సుర్జేవాలా ప్రశ్నించారు.
(చదవండి : ట్రంప్‌ను విలన్‌తో పోల్చిన కాంగ్రెస్‌ నేత)

ఇక 1999లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హైజాక్‌ విషయాన్ని గుర్తు చేసిన సుర్జేవాలా.. తాలిబన్లతో అమెరికా చేసుకునే ఒప్పందం భారతదేశ రక్షణను వెక్కిరిస్తుంది కదా అని పేర్కొన్నారు. తాలిబన్లతో అమెరికా ఒప్పందం శాంతిని పెంపొందిస్తుందని రష్యా కూడా చెప్తున్న నేపథ్యంలో భారత్‌పై తాలిబన్ల చర్యలన్నీ మర్చిపోవాలా అని ప్రశ్నించారు.
(చదవండి : హౌడీ X నమస్తే)

మరిన్ని వార్తలు