నమస్తే ట్రంప్‌ అదిరింది... 

26 Feb, 2020 03:31 IST|Sakshi

మైత్రి మరింత ముందుకు 

ట్రంప్‌ పర్యటనపై విదేశీ మీడియా కామెంట్లు 

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ పర్యటనపై అంతర్జాతీయ మీడియా ఆసక్తి కనబరిచింది. సీఎన్‌ఎస్‌ ఇంటర్నేషనల్, న్యూయార్క్‌ టైమ్స్, ద గార్డియన్, బీబీసీ సహా పాకిస్తానీ మీడియా సంస్థలు ట్రంప్‌ పర్యటనను ప్రముఖంగా ప్రస్తావించాయి. అశేష జనసందోహం నడుమ అమెరికా అధ్యక్షుడికి భారత్‌లో ప్రేమపూర్వక స్వాగతం లభించిందని సీఎన్‌ఎన్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. భారత ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనంతో ట్రంప్‌కు స్వాగతం పలికారని వెల్లడించింది. ట్రంప్‌ తన ప్రసంగంలో పలు భారతీయ పదాలను పలకడంలో తడబడ్డారని పేర్కొంది. ట్రంప్‌ తన ప్రసంగంలో భాగంగా పేర్కొన్న ‘అమెరికా భారత్‌ను ప్రేమిస్తుంది’అనే అంశాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రధాన శీర్షికగా చేసుకుంది. అయితే, మోదీ ప్రభుత్వంపై వెల్లువెత్తే విమర్శలను ట్రంప్‌ ప్రస్తావించలేదని తెలిపింది.  

పౌరసత్వ చట్టం సహా పలు అంశాల విషయంలో గత మూడు నెలలుగా భారత్‌లో మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రంప్‌ పర్యటన కాస్త ఊరడింపుగా మారిందని ద గార్డియన్‌ పేర్కొంది.  భారత్‌లో అమెరికా అధ్యక్షుడికి ఆత్మీయ స్వాగతం లభించిందని బీబీసీ పేర్కొంది. భారతీయ పదాలను పలకడంలో ట్రంప్‌ తడబడ్డారని తెలిపింది.  ట్రంప్‌ పర్యటన విషయంలో పాకిస్తాన్‌ మీడియా మరోసారి తన తీరును వెళ్లగక్కింది. ట్రంప్‌ పర్యటన మొత్తంలో పాక్‌ గురించి మాట్లాడిన వ్యాఖ్యలను మాత్రమే హైలెట్‌ చేసింది. పాక్‌తో సత్సంబంధాలు ఉన్నాయన్న ట్రంప్‌ మాటలను ప్రస్తావించింది. 

>
మరిన్ని వార్తలు