విందుకు  వేళాయె...

26 Feb, 2020 03:49 IST|Sakshi
రాష్ట్రపతి భవన్‌లోకి వెళుతున్న ట్రంప్‌ దంపతులు

రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులకు విందు  

హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య, సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే 

సీఎం కేసీఆర్‌ సహా నలుగురు ముఖ్యమంత్రులు 

సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్, పారిశ్రామికవేత్త అజీమ్‌ ప్రేమ్‌జీ 

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు సమావేశం ఏర్పాటు చేశారు. విందుకు హాజరైన ట్రంప్‌ దంపతులను కోవింద్, ఆయన భార్య సవిత కోవింద్‌ ఆహ్వానం పలికారు. రాష్ట్రపతి భవన్‌లో దర్బార్‌ హాలులోకి ట్రంప్‌ దంపతుల్ని తీసుకువెళ్లి అంతా చూపించారు. ఆ హాలులో 5వ శతాబ్దం నాటి గౌతమ బుద్ధుడి విగ్రహం, భారతీయ నాయకులు చిత్రపటాలు ఉన్నాయి. ఆ తర్వాత ట్రంప్, కోవింద్‌ కాసేపు మాట్లాడుకున్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయని, ఇందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ట్రంప్‌కి ఘనస్వాగతం పలకడమే నిదర్శనమని అన్నారు. అమెరికా తమకు  అత్యంత విలువైన మిత్ర దేశమని, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి భారత్‌ కట్టుబడి ఉందని అన్నారు.  

ఈ రెండు రోజులు అద్భుతంగా గడిచాయని, ఎంతో ప్రయోజనకరమైన చర్చలు జరిగాయని ట్రంప్‌ తెలిపారు. వాణిజ్య, రక్షణ ఒప్పందాల్లో ముందడుగులు పడ్డాయని చెప్పారు. భారత్‌కు రావడం వల్ల ఎంతో నేర్చుకున్నామని,, ఎన్నో అందమైన అనుభూతులతో తిరిగి వెళుతున్నామని ట్రంప్‌ చెప్పారు. రాష్ట్రపతి కోవింద్‌ చేసిన అతిథి మర్యాదలకు ఆయనకు, ఆయన అనుచర వర్గానికి ట్రంప్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ విందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులతోపాటు నలుగురు ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు(తెలంగాణ), బీఎస్‌ యడియూరప్ప(కర్ణాటక), మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (హరియాణా),శర్బానంద సోనోవాల్‌(అస్సాం)..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ, బ్యాంకర్‌ ఉదయ్‌ కొటక్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడి రాకను పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. విందు అనంతరం ట్రంప్‌ తిరుగు పయనమయ్యారు.
ఇవాంకా, కుష్నర్‌ దంపతులను రాష్ట్రపతికి పరిచయం చేస్తున్న ట్రంప్‌..చిత్రంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య 

విందు ప్రత్యేకత ఏమంటే.. 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి కోవింద్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు భలే పసందుగా ఉంది. ట్రంప్‌ మాంసాహార ప్రియుడు. ఎక్కడికెళ్లినా ఆయనకు బీఫ్‌ స్టీక్స్, మీట్‌ లోఫ్, బర్గర్స్‌ లాంటి వాటినే ఇష్టంగా లాగిస్తారు. అందుకే భారతీయ రుచులు, ట్రంప్‌ అభిరుచులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రపతి భవన్‌ వర్గాలు రెండు రకాల మెనూలు తయారు చేశాయి. 
వెజిటేరియన్‌ వంటకాలు: కోరియాండర్‌ షోర్బా, ఆలూ టిక్కీ, పాలక్‌ పాప్డి, జార్ఖెజ్‌ జమీన్, దాల్‌ రైజినా వగైరాలు, నాన్‌ వెజ్‌ మెనూ: రాన్‌ అలీషాన్, కాజూ స్పైస్డ్‌ సాల్మన్, డెజర్ట్స్‌: హాజల్‌నెట్‌ యాపిల్‌ పై, కారమెల్‌ సాస్, మల్పువా రబ్రీరోల్‌.. ఎపిటైటర్‌గా అమ్యూజ్‌ బౌచె  

లంచ్‌ @ హైదరాబాద్‌ హౌస్‌
ట్రంప్, మోదీ మధ్య చర్చల అనంతరం హైదరాబాద్‌ హౌస్‌లో లంచ్‌ ఏర్పాటు చేశారు. మోదీ పక్కా శాకాహారి కావడంతో రెండు రకాల మెనూలు సిద్ధం చేశారు. ఈ లంచ్‌కి ఫస్ట్‌ లేడీ మెలానియా, ట్రంప్‌ కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌లు హాజరయ్యారు. సారంగి, సంతూ ర్‌ జుగల్‌బందీ చేస్తూ హాయి గొలిపే సంగీతం, గాంధీజీకి అత్యంత ఇష్టమైన వైష్ణవ భజనలు వస్తూ ఉంటే  ఈ లంచ్‌ కార్యక్రమం జరిగింది. భజనలు, ఘజల్స్, పాశ్చాత్య సంగీత, హిందీ సినిమా పాటల్ని ప్లే చేశారు. అణువణువున దేశభక్తి ఉప్పొంగే మిలేసుర్‌ మేరా తుమ్హారా  పాట కూడా వినిపించారు. హిందీ ఆపాత మధురాలైన మేరే గీత్‌ అమర్‌ కర్‌ దో, పీయా తోసే నైనా లగే రే, సత్యం శివం, సుందరం వంటివి గీతాలు ప్లే అవుతూ ఉంటే, అత్యంత ఆహ్లాదకర వాతారవణంలో భోజనాలు చేశారు. పైనాపిల్, మస్టర్డ్‌ సీడ్స్‌తో తయారు చేసిన అనాస్‌ సన్సావ్, పనసపండుతో తయారు చేసిన పాంచ్‌ ఫోరాన్‌ కాథల్, జీరా బన్, హాక్‌ చెనా కబాబ్, స్ప్రౌట్స్‌తో తయారు చేసిన సూప్, రకరకాల రోటీలు, నాన్‌లు, ఖర్జూరం హల్వా, అంజీర్‌ ఐస్‌క్రీమ్, చోటీ స్వీట్స్‌ వంటివి వెజ్‌ మెనూలో ఉన్నాయి. ఇక నాన్‌వెజ్‌ వంటకాల్లో కశ్మీర్‌ కుంకుం పువ్వు వేసిన రిచ్‌ గ్రేవీతో తయారు చేసిన కోడికూర, చికెన్‌ పఫ్‌లు, మసాలా తక్కువగా వేసిన మటన్‌ కర్రీ, పింక్‌ సాల్మన్‌ స్వీట్‌ బాసిల్‌ చట్నీ వడ్డించారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా