కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!

26 Feb, 2020 03:25 IST|Sakshi
హైదరాబాద్‌ హౌజ్‌లో చర్చలు జరుపుతున్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

వివాదాస్పద అంశాలపై స్పందించనంటూనే కశ్మీర్‌పై కామెంట్‌ చేసిన ట్రంప్‌ 

భారత్‌లో మతస్వేచ్ఛపై ప్రధాని మోదీతో చర్చించానని వెల్లడి 

అమెరికా ఉత్పత్తులపై భారత్‌ సుంకాలు భారీగా విధిస్తోందని ఆరోపణ

న్యూఢిల్లీ: ఈ పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) భారత్‌ అంతర్గత వ్యవహారమని, ఆ విషయమై తాను ఏమీ వ్యాఖ్యానించబోనని తేల్చిచెప్పారు. భారత పర్యటన సందర్భంగా మంగళవారం ట్రంప్‌ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌లో ప్రజలకు మతస్వేచ్ఛ ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారనే తాను భావిస్తున్నానన్నారు. ‘వివాదాస్పద అంశాల జోలికి వెళ్లాలనుకోవడం లేదు. వివాదాస్పద అంశాలకు సంబంధించిన ఒక చిన్న సమాధానం నా మొత్తం పర్యటన సానుకూలతను ముంచేస్తుంది.(అమెరికాకు బయల్దేరిన ట్రంప్‌ బృందం)

ఆ జవాబును మాత్రమే మీరు పట్టించుకుంటారు. నా పర్యటన అంతా పక్కనబెడ్తారు’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనంటూనే.. అంతా కోరుకుంటే కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. కశ్మీర్‌ను భారత్, పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న అతి పెద్ద సమస్యగా ట్రంప్‌ అభివర్ణించారు. ‘ఉద్రిక్తతలు తొలగేలా మధ్యవర్తితం చేయమంటే.. అందుకు నేను సిద్దం’అన్నారు. మోదీ, ఇమ్రాన్‌ఖాన్‌.. ఇద్దరితో తనకు సత్సంబంధాలున్నాయన్నారు. ప్రతీ విషయానికి రెండు వాదనలుంటాయని వ్యాఖ్యానించారు. గతంలోనూ పలు సందర్భాల్లో కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో నాకు మంచి సంబంధాలున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్‌ సమస్యపై కృషి చేస్తున్నారు’అని ట్రంప్‌ పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీతో జరిగిన చర్చల్లో పాకిస్తాన్‌ అంశం ప్రస్తావనకు వచ్చిందన్నారు. పాక్‌ నుంచి తలెత్తుతున్న ఉగ్రవాదంపై కూడా చర్చించామన్నారు. ఈ సందర్భంగా మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ సరళంగా వ్యవహరించే, చాలా శక్తిమంతమైన నేత అని వ్యాఖ్యానించారు. ‘మోదీ గట్టి మనిషి. తానేమనుకుంటాడో అది చేస్తారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటారు’అన్నారు.  

ట్రంప్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

వాణిజ్యంపై.. 
దిగుమతుల సుంకాలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటన్నారు. భారత్‌ దిగుమతి చేసుకుంటున్న హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై విధిస్తున్న భారీ సంకాల విషయాన్ని ట్రంప్‌ ప్రస్తావించారు. ఈ టారిఫ్‌ల విషయంలో అమెరికాతో సానుకూలంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. అమెరికా నుంచి భారత్‌ భారీగా మిలటరీ హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేస్తోందన్నారు. తాలిబన్‌తో అమెరికా శాంతి ఒప్పందాన్ని భారత్‌ సమర్ధిస్తుందనే తాను భావిస్తున్నానన్నారు. అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందా? అన్న ప్రశ్నకు.. అలాంటి సమాచారమేదీ తనకు నిఘా వర్గాల నుంచి రాలేదన్నారు. ((సీఎన్‌ఎన్‌ X ట్రంప్‌)
ఢిల్లీ అల్లర్లు అంతర్గతం 
ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లపై మోదీతో చర్చించారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. వ్యక్తిగత దాడుల గురించి చర్చించబోనన్నారు. అది భారత్‌ సొంత విషయమని స్పష్టం చేశారు. సీఏఏపై తాను ఏమీ మాట్లాడబోనని ట్రంప్‌ స్పష్టం చేశారు. భారత్‌ తన దేశ ప్రజల కోసం సరైన నిర్ణయాలే తీసుకుంటుందని భావిస్తున్నానన్నారు. భారత్‌లో ముస్లింలు వివక్షకు గురవుతున్నారని, వారిపై ద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయన్న వార్తలపై స్పందించాలన్న ప్రశ్నకు.. ‘మోదీతో చర్చల్లో ముస్లింల ప్రస్తావన కూడా వచ్చింది. క్రిస్టియన్ల గురించి కూడా చర్చించాం’అన్నారు. ఈ విషయమై ప్రధాని మోదీ నుంచి తనకు శక్తిమంతమైన సమాధానం లభించిందన్నారు. కాగా, మోదీ, ట్రంప్‌ల మధ్య చర్చల్లో సీఏఏ అంశం చర్చకు రాలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా పేర్కొన్నారు. మత సామరస్యంపై ఇరువురు నేతలు సానుకూల భావాలను వ్యక్తం చేశారన్నారు. 

మత స్వేచ్ఛపై మాట్లాడా... 
ప్రధాని మోదీతో చర్చల సందర్భంగా.. భారత్‌లో మత స్వేచ్ఛ విషయమై సుదీర్ఘంగా చర్చించానని ట్రంప్‌ తెలిపారు. ‘భారత్‌లో మత స్వేచ్ఛపై చర్చించాం. భారత్‌లో ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలనే మోదీ కోరుకుంటున్నారు. ముస్లింలతో కలిసి పనిచేస్తున్నామని మోదీ నాకు చెప్పారు. గతంలోనూ పౌరులకు మతస్వేచ్ఛను అందించేందుకు భారత్‌ కృషి చేసింది’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మోదీ అద్బుతమైన నేత అని, భారత్‌ గొప్ప దేశమని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే.. పౌరులకు మతస్వేచ్ఛ అందించేందుకు భారత్‌ గొప్పగా కృషి చేసిందన్నారు.  

>
మరిన్ని వార్తలు