విజయవంతమైన నేత మోదీ!

11 Nov, 2017 01:59 IST|Sakshi

భారత ప్రధానిపై ట్రంప్‌ ప్రశంసలు

భారత్‌ను ఏకం చేయడంలో సఫలం

భారత్‌ అద్భుతమైన వృద్ధి సాధించిందని కితాబు

డానాంగ్‌: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. భారత్‌ను ఆ దేశ ప్రజలందర్నీ ఏకం చేయడంలో మోదీ విజయవంతంగా ముందుకు సాగుతున్నారని ఆయన కొనియాడారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ అద్భుతమైన వృద్ధి సాధించిందని ట్రంప్‌ పొగడ్తలతో ముంచెత్తారు. వియత్నాంలో జరుగుతున్న ఆసియా–పసిఫిక్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌(ఏపెక్‌) చీఫ్‌ ఎగ్జిక్యుటివ్స్‌ సదస్సులో ఆయన ఒకవైపు భారత్‌ను పొగుడుతూనే.. మరోవైపు చైనా తీరును తప్పుపట్టారు. ‘భారత్‌ ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరిచినప్పటి నుంచి అందరినీ ఆశ్చర్యపరిచేలా వృద్ధి సాధించింది.

వేగంగా విస్తరిస్తున్న మధ్యతరగతి వర్గానికి కొత్త అవకాశాల్ని కల్పించింది. అతి పెద్ద దేశాన్ని, ప్రజల్ని ఒక్కటి చేయడంలో మోదీ శ్రమిస్తున్నారు’ అని ట్రంప్‌ అన్నారు. అదే సమయంలో చైనా అనుసరిస్తున్న వాణిజ్య విధానాల్ని ట్రంప్‌ తప్పుపట్టారు. చైనా అక్రమ వాణిజ్య విధానాలతో అమెరికన్ల ఉపాధి దెబ్బతింటుందని, ఈ విషయంలో అమెరికా చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. మరోవైపు, పాకిస్తాన్‌లో ఎలాంటి ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలు లేవనే నిర్ధారణను అమెరికా కోరుకుంటుందని, ఆ దిశగా ఉగ్ర సంస్థలపై పాకిస్తాన్‌ చర్యలు చేపట్టేలా భారత్, అన్ని నాటో దేశాలతో కలిసి అమెరికా పనిచేస్తుందని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మ్యాటిస్‌ బ్రస్సెల్స్‌లో వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు