ట్రంప్‌ నిర్ణయంతో భారత్‌కు భారీ షాక్‌..

5 Mar, 2019 09:05 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత ప్రయోజనాలకు భారీ విఘాతం కలిగించే మరో నిర్ణయం​ తీసుకున్నారు. అమెరికాలోకి సుంకాలు లేకుండా ఏటా 560 కోట్ల డాలర్ల భారత ఎగుమతులకు అనుమతించే ప్రాధాన్య వర్తక విధానానికి స్వస్తి పలకాలని భావిస్తున్నామని ట్రంప్‌ స్పష్టం చేశారు. సాధారణ ప్రాధాన్యతల వ్యవస్ధ (జీఎస్‌పీ) కింద అభివృద్ధి చెందుతున్న ప్రాయోజిత దేశంగా భారత్‌కు ఇస్తున్న హోదాను ఉపసంహరించాలని ప్రతిపాదిస్తున్నామని కాంగ్రెస్‌ సభ్యులకు రాసిన లేఖలో ట్రంప్‌ పేర్కొన్నారు.

భారత మార్కెట్లను ఇదే తరహాలో అమెరికాకు అందుబాటులో ఉంచాలన్న అమెరికా వినతిపై భారత్‌ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తాను ఈ నిర్ణయం​తీసుకుంటున్నానని ట్రంప్‌ వివరణ ఇచ్చారు. భారత్‌తో అమెరికా వర్తక లోటును తగ్గించే క్రమంలో ట్రంప్‌ ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్టు భావిస్తున్నారు. 2017లో భారత్‌తో అమెరికా వాణిజ్య లోటు 2730 కోట్ల డాలర్లుగా ఉందని అమెరికా ట్రేడ్‌ రిప్రంజేటివ్‌ కార్యాలయం అంచనా వేసింది. జీఎస్‌పీ కార్యక్రమం కింద ప్రపంచంలోనే అతిపెద్ద లబ్ధిదారుగా ఉన్న భారత్‌ 2017లో ట్రంప్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా భారీగా భారత ప్రయోజనాలకు విఘాతం కలిగే చర్య ఇదే కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు