భారత్‌ను అమెరికా ప్రేమిస్తోంది: ట్రంప్‌ హిందీ ట్వీట్‌!

24 Feb, 2020 16:38 IST|Sakshi

అహ్మదాబాద్‌: ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమానికి హాజరైన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని పోస్ట్‌ చేశారు. భారత ప్రజలతో మాట్లాడేందుకు తాను, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ సుదీర్ఘ ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకున్నామన్నారు. అమెరికా ఎల్లప్పుడూ భారత్‌ను ప్రేమిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు మరోసారి హిందీలో ట్వీట్‌ చేసి నెటిజన్లను ఆకట్టుకున్నారు.‘‘భారతదేశంలోని ప్రతీ పౌరుడికి సందేశం ఇచ్చేందుకు నేను, ప్రథమ మహిళ 8000 వేల మైళ్ల ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం! అమెరికా భారత్‌ను ప్రేమిస్తుంది- అమెరికా భారత్‌ను గౌరవిస్తుంది- అమెరికా ప్రజలు ఎల్లప్పుడు... భారత ప్రజలకు నిజమైన, నిబద్ధతతో కూడిన స్నేహితులుగా ఉంటారు’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.(ఆ రెండు క్లాసిక్‌ సినిమాలు: ట్రంప్‌ )

కాగా.. భారత పర్యటనకు బయల్దేరిన క్రమంలో తమ రాక గురించి తెలియజేస్తూ ట్రంప్‌ హిందీలో ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ‘మేము భారత్‌ రావాలని ఎదురుచూస్తున్నాం. దారిలో ఉన్నాం. కొద్ది గంటల్లో అందరినీ కలుస్తాం!’ అని ట్రంప్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక తొలిసారి భారతదేశానికి వచ్చిన అగ్రరాజ్య అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. మొతేరా స్టేడియంలో భారత ప్రజలకు ట్రంప్‌ దంపతులను పరిచయం చేశారు. అనంతరం ప్రధాని మోదీ, డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రసంగించారు. ఆ తర్వాత ట్రంప్‌ అక్కడి నుంచి ఆగ్రాకు పయనమయ్యారు.

మరిన్ని వార్తలు