భవిష్యత్‌లో ప్రబల శక్తిగా భారత్‌ : ట్రంప్‌

24 Feb, 2020 14:59 IST|Sakshi

అహ్మదాబాద్‌ : ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతెరా వేదికగా సాగిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో అగ్రదేశాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ ఆద్యంతం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తుతూ ప్రసంగం కొనసాగించారు. నమస్తే అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్‌ దేశం కోసం మోదీ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రస్తుతించారు. భారత్‌- అమెరికాలు 3 బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని ప్రకటించారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని అంటూ అమెరికా భారత్‌ను అభిమానిస్తుందని అన్నారు. ట్రంప్‌ ఇంకా ఏమన్నారంటే...‘  భారత్‌, అమెరికా ఎప్పటికీ నమ్మదగ్గ స్నేహితులు..లక్ష మందికి పైగా ఇక్కడికి రావడం ముదావహం. భారత్‌ ఆతిథ్యాన్ని ఎన్నటికీ మరిచిపోలేం..ఈ పర్యటన మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిఉంటుంది. ఓ ఛాయ్‌ వాలా స్ధాయి నుంచి మోదీ ప్రధానిగా ఎదిగిన తీరు అద్భుతం..ఇంతటి విశాల దేశాన్ని మోదీ అద్భుతంగా నడిపిస్తున్నారు. అత్యంత విజయవంతమైన ప్రధానుల్లో మోదీ ఒకరు. భారతీయులు ఏదైనా సాదించగలరనేందుకు మోదీ నిదర్శనం.


ఆర్థిక ప్రబల శక్తిగా భారత్‌
భారత్‌ ఆర్థిక ప్రబల శక్తిగా ఎదిగింది. దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 12 కోట్ల మందికి పైగా ప్రజలు ఇంటర్‌నెట్‌ వాడుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఎంతో పురోగతి సాధించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ స్ధాయిలో మధ్యతరగతి ప్రజలు ఉన్నారు


సచిన్‌, కోహ్లీలు ఇక్కడే..
ప్రపంచ క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించి సత్తా చాటిన క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీల పుట్టినిల్లు భారతేనని కొనియాడారు. భవిష్యత్‌లో భారత్‌ అద్భుత శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. ఈ దశాబ్ధంలో భారత్‌ అత్యధిక విజయాలు సాధించింది. ఈ భారీ ప్రజాస్వామ్య దేశాన్ని ప్రధాని మోదీ శాంతియుతంగా ముందుకు తీసుకువెళుతున్నారు. భారత్‌ మాతా కీ జై ’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

చదవండి : మొతెరాలో ఇదొక కొత్త చరిత్ర : మోదీ

మరిన్ని వార్తలు