సబర్మతీకి డొనాల్డ్‌ ట్రంప్‌!

30 Jan, 2020 08:51 IST|Sakshi

ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్ పర్యటన నేపథ్యంలో గుజరాత్‌లోని సబర్మతీ నది తీరాన్ని సందర్శించనున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నార్త్‌ ఢిల్లీలోని శాస్త్రి నగర్‌ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీ మేరకు ఆసియాలోనే సబర్మతీ నదిని అత్యంత పరిశుభ్రమైన నదిగా మార్చారని వెల్లడించారు. ఇంతకముందు భారత పర్యటనకు వచ్చిన జపాన్‌, ఇజ్రాయెల్‌ ప్రధానులు సబర్మతీ నది తీరాన్ని సందర్శించారని గుర్తుచేశారు.(ఫిబ్రవరి 21న భారత్‌కు రానున్న ట్రంప్‌!)

ఈసారి భారత పర్యటనకు రానున్న ట్రంప్‌ సబర్మతీ నదీ తీరాన్ని సందర్శించనున్నారని.. కానీ ఆయన పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని విజయ్‌ రూపానీ తెలిపారు. కాగా ట్రంప్‌ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. వచ్చే నెల 24-26 మధ్య ట్రంప్‌ భారత్‌కు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ట్రంప్‌ పర్యటనలో ప్రధానంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య అంశాలపై పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. 2019 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా డొనాల్డ్‌ ట్రంప్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రంప్‌ అప్పట్లో హాజరుకాలేకపోయారు.

మరిన్ని వార్తలు