రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వెళ్లను: గడ్కారీ

9 Jun, 2014 02:17 IST|Sakshi
రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వెళ్లను: గడ్కారీ

నాగ్‌పూర్: తాను తిరిగి మహారాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉందని వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కొట్టిపడేశారు. తొలుత తాను ఢిల్లీ రాజకీయాల పట్ల మక్కువ చూపేవాడిని కాదని, ప్రస్తుతం తనకు ఢిల్లీ వదిలి వెళ్లే ఉద్దేశం లేదని ఇక్కడ ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్‌లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నేతృత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. మరో కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే ఆకస్మికంగా మృతి చెందడంతో నితిన్ గడ్కారీ మహారాష్ట్రలో పార్టీ బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు వచ్చాయి.

ప్రత్యేక విదర్భ డిమాండ్‌పై మాట్లాడిన గడ్కరీ.. తమ ఆకాంక్ష నెరవేరాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలని, అందునా అన్ని రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం రావాలని అన్నారు. ఇక లక్ష కోట్ల రూపాయలు ఖర్చయ్యే గంగానది శుద్ధి కార్యక్రమాన్ని మరో నాలుగునెలల్లో ప్రారంభిస్తామన్నారు. అలహాబాద్ నుంచి హూగ్లీ వరకూ గంగానదిలో రవాణాను అభివృద్ధిపరిచే ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు