గర్బిణీలకు మాంసం, సెక్స్‌ వద్దా?

16 Jun, 2017 18:50 IST|Sakshi
గర్బిణీలకు మాంసం, సెక్స్‌ వద్దా?
న్యూఢిల్లీ: గర్బిణీలు మాంసం తినరాదని, సాత్విక ఆహారమే తీసుకోవాలని, సెక్స్‌లో పాల్గొనరాదని కేంద్రంలోని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ సూచనలు చేయడం, ‘తల్లీ బిడ్డల సంరక్షణ’ పేరుతో ఓ చిన్న పుస్తకాన్ని కూడా విడుదల చేయడం పట్ల సోషల్‌ మీడియాలో పలువురు, ముఖ్యంగా మహిళలు ధ్వజమెత్తుతున్నారు. మొన్నటి వరకు గోమాంసం ఎవరూ తినరాదంటూ ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆహారపు అలవాట్లు వారి వారి ఇష్టం అంటూ మార్చింది. మళ్లీ ఇప్పుడు గర్భవతుల ఆహారపు అలవాట్లపై సూచనలు చేయడం పట్ల వారు మండిపడుతున్నారు. 
 
గర్భవతులకు కావాల్సిన ఐరన్, పౌష్టికాహారం మాంసం నుంచి వస్తుంది తప్ప, సాత్విక ఆహారం ద్వారా ఎలా వస్తుందని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. చేపలు తినడం తమకు తరతరాల నుంచి వస్తోందని, పైగా చేపలు తమకు శాకాహారమని, చేపలు తినొద్దని సూచించడం ఏమిటని ప్రముఖ చరిత్రకారులు, రచయిత్రి ప్రీతాసేన్‌ ప్రశ్నించారు. చేపల్లో ఇంధనం, ఫాస్పరస్, కాల్సియం ఉంటుందని ఆమె చెప్పారు. మాంసాహారంలో ఉండే పోషక విలువలు ఏ కూరగాయాల్లో ఉంటాయో, ఏ స్థాయిలో ఉంటాయో తెలియజేయాలని ఆమె ప్రభుత్వాన్ని సవాల్‌ చేశారు.
 
ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలు కూడా గర్భవతులకు మాంసం మంచిదని సూచిస్తున్నాయి. గర్భిణీలు గోమాంసం తినడం కూడా మంచిదని, అయితే రోజూ, అందరూ దీన్ని తినకూడదని ‘శుశ్రుతా సంహిత, చరక సంహిత’ లాంటి ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలు సూచిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌తోపాటు కేరళ, మేఘాలయ, అస్సాం రాష్ట్రాల్లో గర్భిణీ మహిళలు చేపలతోపాటు మాంసం కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో గర్బిణీలు ఎక్కువగా శాకాహారాన్ని తీసుకుంటారు. వారు నెయ్యి, బాదం, కర్బూజ గింజలు తీసుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో బొప్పాయి పండ్లను కూడా తీసుకునేవారు. వాటి వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలున్నాయని పరిశోధనల్లో తేలడంతో ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నారు.
 
అస్సాంలో మహిళలు గర్భవతని తెలియగానే మాంసాన్ని తగ్గించి దేశీయ చికెన్‌ను ఎక్కువ తింటారని అస్సామీ హోం చెఫ్, ఫుడ్‌ క్యూరేటర్‌ గీతికా సైకియా తెలిపారు. కేరళలో మహిళలు కుల, మతాలతో సంబంధం లేకుండా పాలకూర, మునుగకాయలు, కర్జూరాలు, పండ్లు, చేపలు, మాంసం ఎక్కువగా తింటారని ప్రముఖ వంటల పుస్తకాల రచయిత్రి లతికా జార్జ్‌ తెలిపారు. కొబ్బరితో వండిన చేపల కూరను గర్బిణీలకు పెడతారని ఆమె చెప్పారు. 
 
నెయ్యి, కొబ్బరి మంచిదని దేశంలోని అన్ని సంస్కతుల వారు అంగీకరిస్తున్నప్పటికీ వారి వారి సంస్కతులను బట్టి ఆహారపు అలవాట్లు ఉంటాయని, ఇలా బలవంతంగా ఒక్క సంస్కతి అలవాట్లను తమపై రుద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం ఏమిటని మహిళలు ప్రశ్నిస్తున్నారు.  సెక్స్‌ కోరికలు చంపుకోవాలని చెప్పడం పట్ల కూడా వారు మండి పడుతున్నారు. ఈ విషయంలో తాము ఎప్పుడైనా వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తామని చెబుతున్నారు. 
మరిన్ని వార్తలు