కార్తీ.. చట్టంతో ఆటలాడొద్దు: సుప్రీం

31 Jan, 2019 05:40 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీం కోర్టు ఘాటైన హెచ్చరిక చేసింది. చట్టంతో ఆటలాడుకోవద్దని హితవు పలికింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరిన కార్తీని ముందుగా రూ.10 కోట్లు తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. ‘ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోవచ్చని కాకపోతే విచారణకు మాత్రం సహకరించాలి’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ పేర్కొన్నారు. ‘విచారణకు సహకరించాల్సి ఉంటుందనే విషయాన్ని మీ క్లయింట్‌కు చెప్పండి. మీరు సహకరించలేదు. చాలా విషయాలు చెప్పాల్సి ఉంది’ అని కార్తీ తరఫు న్యాయవాదికి ధర్మాసనం చెప్పింది. అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నమెంట్స్‌ కోసం వచ్చే నెల ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్‌ దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కార్తీ కోరారు. మాజీ టెన్నిస్‌ ఆటగాడిగా, ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్‌గా, వ్యాపారవేత్తగా వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు