ముండే మరణాన్ని రాజకీయం చేయొద్దు

28 Aug, 2014 22:56 IST|Sakshi
ముండే మరణాన్ని రాజకీయం చేయొద్దు

ముంబై: తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి గోపినాథ్ ముండే ఆకస్మిక మృతిని రాజకీయం చేయొద్దని అతని కుమార్తె పంకజ ముండే విజ్ఞప్తి చేశారు. ఆమె గురువారం సింధ్‌ఖేడ్ రాజాలో ‘సంఘర్ష్ యాత్ర’ను ప్రారంభించారు. ఈ యాత్ర రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 79 నియోజకవర్గాల మీదుగా సుమారు 3,000 కి.మీ. మేర సాగుతుంది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి గత జూన్ మూడో తేదీన ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారని చెప్పారు.

అయితే కొందరు తన తండ్రి మరణాన్ని రాజకీయంగా వాడుకునేందుకు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని, వారి మాటలను ఎవరూ పట్టించుకోవద్దని పరోక్షంగా తన సవతి సోదరుడైన ధనుంజయ్ ముండేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఎన్సీపీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ధనుంజయ్ ముండే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, తన తండ్రి బతికున్నప్పుడు ఏమాత్రం సంబంధాలు లేని వ్యక్తులు, ఇప్పుడు ఆయన ఆకస్మిక మృతితో లబ్ధిపొందాలని చూస్తున్నారని పంకజ విమర్శించారు.

మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ముండే సాబ్ వారసురాలిగా ప్రజలందరూ పంకజను ఆదరిస్తున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- శివసేన కూటమి అధికారంలోకి రానుందని, అప్పుడు రైతుల ఆత్మహత్యలకు కారణమైన వారినందరినీ జైళ్లకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ యాత్రను వాస్తవానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రారంభించాల్సి ఉండగా, ఆమెకు తన రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో తన సందేశాన్ని పంపారు. అలాగే ఈ యాత్రలో పలువురు బీజేపీ అగ్రనాయకులు పాల్గొనాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని పంపజ తెలిపారు. యాత్ర ప్రారంభ కార్యక్రమంలో వేలాదిమంది బీజేపీ కార్యకర్తలు, ముండే అభిమానులు పాల్గొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు