డూడుల్‌ గీయండి... లక్షలు పట్టండి

2 Aug, 2019 03:05 IST|Sakshi

న్యూఢిల్లీ: విద్యార్థులూ.. మీరు చక్కగా బొమ్మలు వేయగలరా? అయితే గూగుల్‌ ఓ కొత్త ఆఫర్‌తో మీ ముందుకు వచ్చింది. మీరంతా గూగుల్‌ వెబ్‌సైట్‌ తెరవగానే గూగుల్‌ లోగోపైన డూడుల్‌ చూసే ఉంటారు. ఏ రోజు ప్రాముఖ్యతను ఆ రోజు చిన్న కార్టూన్‌ రూపంలో అది సూచిస్తుంది. ఇప్పుడు మీరు గీయబోయే చిత్రం ఆ డూడుల్‌ స్థానంలో కనిపించనుంది. నవంబర్‌ 14న ‘బాలల దినోత్సవాన్ని’ పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేయనున్న డూడుల్‌కు కార్టూన్లు వేయాల్సిందిగా గూగుల్‌ కోరుతోంది. ఇది కేవలం మీ డూడుల్‌ కనిపించేలా చేయడమే కాదండోయ్‌.. అయిదు లక్షల క్యాష్‌ను కూడా మోసుకొస్తుంది.

‘నేను పెద్దయ్యే సరికి.. నేనేం ఆశిస్తున్నానంటే’ అన్న అంశం మీద డూడుల్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. ఈ అంశం కింద, మీకు ఉన్న ఏ ఆలోచనకైనా రూపం ఇవ్వచ్చు. ఉదాహరణకు చంద్రుడి మీద జీవితం ఎలా ఉంటుంది? భూమ్మీద కాలుష్యం లేకపోతే ఎలా ఉంటుంది? భూమి అంతా సాధు జంతువులతో నిండిపోతే ఎలా ఉంటుంది ? వంటి ఏ అంశం మీదైనా డూడుల్‌ తయారు చేయవచ్చు.డూడుల్‌లో కచ్చితంగా ‘జీఓఓజీఎల్‌ఈ’ అన్న గూగుల్‌ స్పెల్లింగ్‌ ఉండాలి.

ఎంపిక ఇలా...: మొదట మీరు గీసిన చిత్రాలన్నింటినీ గూగుల్‌ బృందం ఎంపిక చేస్తుంది. ఈ బృందంలో బాగా డూడుల్స్‌ తయారుచేసే నేహా డూడుల్స్‌ మేడం, యూట్యూబ్‌లో టాలెంట్‌ చూపించే ప్రజక్త కోళి, మనందరికీ ఇష్టమైన ఛోటా భీమ్‌ బొమ్మ గీసిన రాజివ్‌ చికాల కూడా ఉన్నారు. వీరంతా మేటిగా ఉన్న 20 చిత్రాలను ఎంపిక చేస్తారు. వీటిని అక్టోబర్‌ 21 నుంచి నవంబర్‌ 6 వరకు పబ్లిక్‌ ఓటింగ్‌లో ఉంచుతారు. గెలిచిన వారికి 5 లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు రూ. 2 లక్షల విలువైన సాంకేతికతను మీ పాఠశాలకు ఇస్తారు.

మరిన్ని వార్తలు