దూరదర్శన్‌కు కొత్త లోగో: గెలిస్తే బంపర్‌ ప్రైజ్‌

29 Jul, 2017 12:03 IST|Sakshi
దూరదర్శన్‌కు కొత్త లోగో: గెలిస్తే బంపర్‌ ప్రైజ్‌
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్రాడ్‌ కాస్టింగ్‌ ఛానల్‌ దూరదర్శన్‌ ఐకానిక్‌ లోగో మారబోతుంది. కాలానుగుణంగా, యువ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి లోగో మార్పునకు దూరదర్శన్‌ ముందుకు వచ్చింది. ఇందు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను కూడా దూరదర్శన్‌ ఆహ్వానిస్తోంది. కొత్త లోగో కోసం ఐడియాలు ఇస్తూ దరఖాస్తులను ఆగస్టు 14 వరకు సమర్పించాలని, గెలిచిన వారికి లక్ష రూపాయల వరకు బహుమానం కూడా ఇవ్వనున్నట్టు దూరదర్శన్‌ వెల్లడించింది. 30 ఏళ్ల కంటే తక్కువ వయసున యువతరాన్ని ఆకట్టుకోవడంతో దూరదర్శన్‌ విఫలమవుతుందని, ఈ నేపథ్యంలో లోగో మార్పు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చిందని దూరదర్శన్‌ నడిపే ప్రసారభారతీ సీఈవో శశి శేఖర్‌ వెంపటి తెలిపారు. దాదాపు 58 ఏళ్ల తర్వాత లోగో మార్చబోతున్నట్టు చెప్పారు. ఇది దేశంలోని యువతరంతో సంభాషించడానికి తాజా ప్రయత్నంగా వెంపటి అభివర్ణించారు.
 
డీడీ బ్రాండును సరికొత్తగా తీసుకొస్తామన్నారు. బ్రాడ్‌ కాస్టింగ్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దూరదర్శన్‌ను 1959లో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీన్ని ఏర్పాటుచేసినట్టు మనుషుల కన్ను రూపంలో ఉండే ఇప్పటి లోగోను ఎంపిక చేశారు. అప్పటి నుంచీ అదే లోగో ప్రచారంలో ఉంది. ప్రస్తుత ప్రజల ఇష్టాలకు అనుగుణంగా, యువతను ఆకర్షించేలా కొత్త లోగో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మనదేశంలో 30 ఏళ్లలోపు యువతీయువకులు చాలామంది ఉన్నారని, వీరంతా దూరదర్శన్‌ కంటే చాలా చిన్నవారని, అప్పటి ప్రజల మనోభావాలకు, ఇష్టాలకు అనుగుణంగా ఆ లోగోను ఎంచుకున్నారని చెప్పారు. కానీ, ప్రస్తుత యువత ఆసక్తివేరుగా ఉందని, అందువల్ల వారిని అందరినీ ఆకట్టుకునేలా లోగో ఉండాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దూరదర్శన్ నేషనల్‌, రీజనల్‌, స్పోర్ట్స్‌ వంటి 21 చానళ్లను ఆపరేట్‌ చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 65 శాతం మంది 35 ఏళ్లకు తక్కువగా ఉన్న వారే.
మరిన్ని వార్తలు