అలా ఆ దేశాలు కరోనా వ్యాప్తిని అరికట్టాయి..

18 Mar, 2020 10:49 IST|Sakshi

చంఢీఘడ్‌ :కరోనాను పూర్తిగా అరికట్టడం అన్నది కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం ప్రకటించటం లాంటిది. అయితే దాన్ని మరొకరికి వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చ’ని మేదాంత ది మెడిసిటీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. నరేశ్‌ ట్రెహాన్‌ అంటున్నారు. మేదాంత ది మెడిసిటీ హాస్పిటల్‌లో నరేశ్‌ నేతృత్వంలో కరోనా వైరస్‌ సోకిన 14మంది ఇటాలియన్లకు చికిత్స జరుగుతోంది. ఈ సందర్భంగా డా. నరేశ్‌ ట్రెహాన్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స చేసిన అనుభవాలను, నేర్చుకున్న పాఠాలను, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను పంచుకున్నారు.

‘‘మా ఆసుపత్రిలో కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స చేయటానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. అయితే వైరస్‌ వ్యాప్తి చెందకుండా చేయటమే పెద్ద సవాలు. దీని కోసం ఆసుపత్రిలో ఓ ఏరియాను కేటాయించాం. ఒక ఆసుపత్రిలో 10మంది మరో ఆసుపత్రిలో మరికొంతమంది అన్నట్లు ఉండకూడదు. ఇలా అయితే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ. అందుకే ఒకే చోట 500మంది రోగులకు చికిత్స చేసేందుకు వీలుండేలా పెద్ద ప్రదేశాన్ని కేటాయించాలి. చైనా, కొరియాలు ఇలానే చేసి వైరస్‌ వ్యాప్తిని అరికట్టాయి. ముఖ్యంగా రోగులకు చికత్స చేసేవారికి కూడా ఎంతో ఓపికి ఉండాలి. దేనికైనా సిద్ధం అనేలా ఉండాలి. ( కరోనా ఎఫెక్ట్‌: ఇకపై వాట్సాప్‌లో పరీక్షా ఫలితాలు )

అందరికీ కరోనా నిర్థారణ పరీక్షలు చేయాలా అన్న విషయానికి వస్తే.. అవసరం లేదు. ఇలా అందరికి పరీక్షలు చేసుకుంటూ వెళితే అవసరమైన వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెద్ద మొత్తంలో పరీక్షలు చేసేందుకు అవసరమైన సరంజామా కూడా మన వద్ద లేదు. డబ్బు వృధా చేయటం తప్ప వేరే ఏ ఉపయోగం ఉండదు. పరిస్థితుల్లో మార్పు వచ్చి ఎవరికి వారు తమ సొంతడబ్బుతో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తే.. ప్రభుత్వం పరీక్షలకు ఓ రేటును నిర్ణయించి పరీక్షలు జరపించాలి. 

సోషల్‌మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు మంచివి కావు. కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. దాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవాలో మనకు తెలుసుండాలి. సమాచారం త్వరగా అందజేయటానికి ఇదెంతో మేలైనది. ప్రజల్లో మరింత అవగాహన రావాల్సి ఉంద’ని అన్నారు.

మరిన్ని వార్తలు