డా. కఫీల్‌ఖాన్‌ మామను కాల్చి చంపిన దుండగులు

23 Feb, 2020 16:56 IST|Sakshi

గోరఖ్‌పూర్‌: 60 మంది నవజాత శిశువుల మరణానికి కారకుడని ఆరోపణలు ఎదుర్కొన్న డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ మామను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన శనివారం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. కఫీల్‌ ఖాన్‌ మామ నుస్రుతుల్లా వార్సి శనివారం పొరుగింట్లో కాసేపు చెస్‌ ఆడి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అదును కోసం ఎదురు చూసిన దుండగులు అతనిపై కాల్పులకు తెగబడ్డారు. బుల్లెట్‌ నేరుగా తలలోకి దూసుకుపోవడంతో అతను ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. అనంతరం దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. (గోరఖ్‌పూర్‌ ఘటన.. ఓ పనైపోయింది)

కాగా అతనిపై అక్రమ భూదందా నడుపుతున్నాడనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితునికి బాగా తెలిసిన వ్యక్తులే ఈ నేరానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కఫీల్‌ సోదరుడు కషీఫ్‌ జమీల్‌ను కూడా ఆస్తి తగాదా నేపథ్యంలో హత్య చేసిన విషయం తెలిసిందే. 2017లో ఆక్సిజన్‌ కొరత కారణంగా యూపీలోని గోరఖ్‌పూర్‌ ఆస్పత్రిలో 62 మంది చిన్నారులు మరణించారు. దీనికి ఆసుపత్రి వైద్యుడు కఫీల్ ఖాన్ నిర్లక్ష్యమే కారణమని భావించి అతన్ని సస్పెండ్‌ చేయడంతో పాటు ఏడు నెలలకు పైగా జైలు శిక్ష విధించారు. అనంతరం 2018 ఏప్రిల్‌లో అతను జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక పౌరసత్వ సవరణ చట్టంపైనా వ్యతిరేక నినాదాలు కొద్దిరోజుల పాటు జైలు శిక్ష అనుభవించాడు. (చిన్నారుల మారణహోమానికి అతను కారణం కాదు)

మరిన్ని వార్తలు