మహిళపై దౌర్జన్యం..ముగ్గురు అరెస్ట్!

10 May, 2016 12:35 IST|Sakshi

పూనెః యువతిపై దాడికి దిగిన ఐదుగురు యువకుల్లో ఎట్టకేలకు  పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. తనపై ఐదుగురు యువకులు దౌర్జన్యానికి దిగారని, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వారం రోజులుగా ఓ మహిళ  పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించేందుకు, ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసేందుకు అంగీకరించలేదు.  చివరికి ఆమె ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సుమారు పది రోజులక్రితం జరిగిన ఘటనలో పూనేకు చెందిన  22 ఏళ్ళ  మహిళా అడ్వర్ టైజింగ్ ఎగ్జిక్యూటివ్ పై ఐదుగురు యువకులు దౌర్జన్యానికి దిగారు. కారులో ఉన్న ఆమెను జుట్టు పట్టుకొని బయటకు లాగి తీవ్రంగా కొట్టారు.  తమ కుటుంబాల్లోని మహిళలు, బాలికలు ఎవ్వరూ కురచ దుస్తులు వేసుకోకూడదని, పర పురుషులతో కలసి ప్రయాణించకూడదని బెదిరింపులకు కూడ పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తనపై జరిగిన దాడిని గురించి  ఫిర్యాదు చేసేందుకు వారం రోజులపాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. అయితే ఏ ఒక్కరూ ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఉన్నతాధికారులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. మహిళ ఫిర్యాదు స్వీకరించని ముగ్గురు పోలీసులపై కూడ తాము చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ రష్మి సుక్లా తెలిపారు.

మే 1వ తేదీన ఇద్దరు మగ కొలీగ్స్ తో కలసి కారులో వెడుతున్నబాధితురాలు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన సమయంలో మరో కారులో వెడుతున్న ఐదుగురు యువకులు ఆమెపై వేధింపులకు దిగారు. కారును చుట్టుముట్టి, తెరచి ఉన్న విండోనుంచి ఉమ్ము వేయడమే కాక, డోర్ తెరచి ఆమెను బలవంతంగా కారు నుంచి బయటకు లాగి, ఆమె అపార్ట్ మెంట్ కు ముందే తీవ్రంగా కొట్టి అక్కడినుంచి జారుకున్నారు. ఐదు నిమిషాల తర్వాత తిరిగి వెనక్కు వచ్చి, సహాయంకోసం తన బంధువులకు, మిత్రులకు ఫోన్ చేస్తున్న ఆమెను బెదిరింపులకు పాల్పడ్డారు. నీ ఇల్లు అడ్రస్ తెలిసిందని, తర్వాత నీ సంగతి చూస్కుంటామని, నువ్వు ఎవరితో చెప్పుకున్నా లాభం లేదని, తమకు ఎంతో మంచి పరిచయాలు ఉన్నాయని బెదిరించారని బాధితురాలు తెలిపింది. అయితే ఇంత జరిగినా ఘటనలో ఎటువంటి సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ దొరకక పోవడం విశేషం.

మరిన్ని వార్తలు