చైనా బోర్డర్‌లో ఐఏఎఫ్‌ చాపర్‌ క్రాష్‌ : వీడియో

29 Oct, 2017 20:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌(ఐఏఎఫ్‌)కు చెందిన హెలికాప్టర్‌ కుప్పకూలి, ఏడుగురు సిబ్బంది చనిపోయిన ఘటన తాలూకు వీడియో సంచలనంగా మారింది. చైనా సరిహద్దుకు అతి సమీపంలోని యాంగ్చీ(అరుణాచల్‌ ప్రదేశ్‌) ప్రాంతంలో అక్టోబర్‌ 6న ఐఏఎఫ్‌ ఎమ్‌ఐ17వీ5 చాపర్‌ కూలిపోయింది. నాటి ప్రమాదానికి కారణం సాంకేతికలోపమే అని మొదట భావించినా, తాజాగా లభించిన వీడియోనుబట్టి నిర్లక్ష్యమే అసలు కారణంగా వెల్లడైంది.

కిరోసిన్‌ క్యాన్లను విసిరేస్తుండగా.. : ఎక్కువ ఎత్తులోనూ ప్రయాణిస్తూ, ఎక్కువ బరువును మోయగల సామర్థ్యం ఎమ్‌ఐ17వీ5 చాపర్‌ సొంతం. అక్టోబర్‌ 6 ఉదయం పైలట్‌, కోపైలట్‌ సహా ఏడుగురు సిబ్బంది బేస్‌క్యాంపు నుంచి కిరోసిన్‌ క్యాన్లతో బయలుదేరారు. ఆ కిరోసిన్‌ డబ్బాలను దగ్గర్లోని మరో స్థావరానికి చేర్చడం వారి ప్రధాన లక్ష్యం. హెలికాప్టర్‌ గాలిలో ఉండగానే ఒక్కో కిరోసిన్‌ డబ్బాను  పారాచూట్‌ సాయంతో కిందికి జారవిడిచే ప్రయత్నం చేశారు. అందులో ఒక పారాచుట్‌ అనూహ్యంగా హెలికాప్టర్‌ టెయిల్‌ రోటార్‌(వెనుక ఫ్యాన్‌)కు చిక్కుకుపోయింది. దీంతో చాపర్‌పై పైటల్‌ నియంత్రణ కోల్పోవడం, క్షణాల్లోనే అది కుప్పకూలడం జరిగింది. ఘటన జరిగిన 23 రోజుల తర్వాత వీడియో వెలుగులోకి రావడం గమనార్హం. దీనిపై ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ అధికారులు స్పందించాల్సిఉంది.
కుప్పకూలిన హెలికాప్టర్‌ : వీడియో (ఎన్డీటీవీ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు