60 ఏళ్ల డీఆర్‌ఐ : ఎన్నో ఘనతలు

17 Jul, 2018 16:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : యాంటీ స్మగ్లింగ్‌, నకిలీ నోట్లు, నకిలీ బంగారం, డ్రగ్స్‌ నియంత్రణలపై దృష్టి సారిస్తోన్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌(డీఆర్‌ఐ) నేటితో 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1957లో డీఆర్‌ఐను స్థాపించారు. 1992లో హైదరాబాద్‌ కేంద్రంగా స్థానికంగా డీఆర్‌ఐ ప్రారంభమైంది. 1992 నుంచి ఇప్పటివరకూ హైదరాబాద్‌ డీఆర్‌ఐ ఎన్నో ఘనతలు సాధించిందని అడిషనల్ డైరెక్టర్‌ జనరల్‌ ఎంకే సింగ్‌ పేర్కొన్నారు. డీఆర్‌ఐ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రం ఇప్పటివరకూ 660 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేసిందని వెల్లడించారు.

18,900 కిలోల గంజాయి, 26 లక్షల నకిలీ కరెన్సీని పట్టుకున్నట్లు చెప్పారు. వీటిపై 25 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. స్మగ్లింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. గత రెండేళ్లలో డీఆర్‌ఐ-హైదరాబాద్‌ మంచి పురోభివృద్ధిని సాధించినట్లు తెలిపారు. 2017-18ల మధ్య 127 కేసుల్లో 817 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్లు చెప్పారు. అక్రమంగా తరలిస్తున్న 148 కోట్లను స్వాధీనం చేసుకుని 61 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.13 బంగారం స్మగ్లింగ్ కేసుల్లో 7 కోట్ల రూపాయల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

16 నార్కోటిక్ డ్రగ్ కేసుల్లో 41 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 14 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి 9 వేల కిలోల గంజాయిని పట్టుకున్నామని చెప్పారు.
వీటితో పాటు 4 సిగరెట్ స్మగ్లింగ్ కేసుల్లో 9 కోట్ల రూపాయలు విలువైన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని ఎంకే సింగ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు