ఓలా క్యాబ్‌ క్యాన్సిల్‌, రచ్చ.. రచ్చ

23 Apr, 2018 08:27 IST|Sakshi
అభిషేక్‌ చేసిన ట్వీట్‌ తాలుకు స్క్రీన్‌ షాట్‌

లక్నో :  క్యాబ్‌ బుక్‌ చేసుకుని.. ఆ వెంటనే దానిని రద్దు చేసుకున్న ఓ వ్యక్తి నిర్వాకం సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డ్రైవర్‌ ఇస్లాం మతస్థుడు కావటమే తాను ఆ పని చేయటానికి కారణమంటూ సదరు వ్యక్తి ట్వీటర్‌లో పోస్టు చేసి పెను దుమారం రేపాడు. ఈ వ్యవహారంపై పలువురు అతన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.  

అయోధ్యకు చెందిన అభిషేక్‌ మిశ్రా లక్నోలో ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్‌ 20న అతగాడు ఓలా క్యాబ్‌ను బుక్‌ చేసుకున్నాడు. అయితే తీరా క్యాబ్‌ డ్రైవర్‌, తదితర వివరాలను ఓలా అతని మొబైల్‌కు పంపగా.. అర్థాంతరంగా అతను తన బుకింగ్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నాడు. ‘ఓలా క్యాబ్‌ను రద్దు చేసుకున్నా. ఎందుకంటే ఆ డ్రైవర్‌ ఓ ముస్లిం. నా సొమ్మును జిహాదీ ప్రజలకు ఇవ్వటం నాకు ఇష్టం లేదు’ అంటూ ట్వీటర్లో పోస్టు చేశాడు.

ఇక అతని ట్వీట్‌పై తీవ్ర స్థాయిలో పలువురు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వారు దేశానికి ప్రమాదకరమని కొందరు రీట్వీట్లు చేస్తే.. ఇలాంటోళ్లను దేశం నుంచి తరిమేయాలని కొందరు.. దేశానికి చెడ్డ పేరు తెచ్చేది ఇలాంటి వారేనంటూ మరికొందరు తిట్టిపోస్తున్నారు. ఈ ఘటనపై ఓలా కూడా స్పందించింది. ‘ఇలాంటి విద్వేషాలను మేం ఎప్పుడూ ఉపేక్షించబోం. డ్రైవర్లకు-కస్టమర్లకు మధ్య సంధానకర్తగా వ్యవహరించాల్సిన బాధ్యత మాది. ఒకరినొకరిని గౌరవించాలనే మేం చెప్పేది. అంతేకానీ, కుల, మత, ప్రాంతీయ బేధాలు మాకు లేవ్‌’ అంటూ ఓలా ట్వీట్‌ చేసింది. 

అభిషేక్‌ మిశ్రా మరో ట్వీట్‌... అభిషేక్‌కు వీహెచ్‌పీ, భజ్‌రంగ్‌దళ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ తదితర సంస్థలతో సంబంధం ఉంది. వీహెచ్‌పీ ఐటీ విభాగానికి అతను పని చేస్తున్నాడు కూడా. ఈ నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను పలువురు కోరుతున్నారు. అయితే తనపై వస్తున్న విమర్శలకు అభిషేక్‌ కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నాడు. హనుమంతుడి పోస్టర్లను క్యాబ్‌లపై వేసి నడిపించినప్పుడు.. నా వాదనను ఎందుకు అంగీకరించరు అంటూ ఓ మహిళ చేసిన ఫేస్‌బుక్‌ పోస్టును తన ట్వీటర్‌లో అభిషేక్‌ ఉంచాడు.

మరిన్ని వార్తలు