డ్రోన్‌ ద్వారా అవయవాలు!

1 Dec, 2018 04:29 IST|Sakshi

నిమిషాల్లో అత్యవసర మందులూ చేరవేత

న్యూఢిల్లీ: ఓ నగరంలోని ఆసుపత్రిలో దాత నుంచి సేకరించిన అవయవాలను నిమిషాల వ్యవధిలో మరో ఆసుపత్రిలోని రోగికి అమర్చవచ్చు. ఒకచోటి నుంచి మరోచోటికి అత్యవసర పరిస్థితుల్లో మందుల్ని అప్పటికప్పుడు చేరవేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న కొత్త డ్రోన్‌ ద్వారా ఈ రెండు ఘటనలు వాస్తవరూపం దాల్చనున్నాయి. ఈ విషయమై పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్‌ సిన్హా మాట్లాడుతూ..‘ఆసుపత్రుల మధ్య డ్రోన్ల రాకపోకల కొత్త డ్రోన్‌ విధానానికి సంబంధించి డిసెంబర్‌ 1(నేటి) నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తులు స్వీకరించిన నెలరోజుల తర్వాత డ్రోన్ల వినియోగానికి లైసెన్సులు జారీచేస్తాం. దేశవ్యాప్తంగా కొన్నిప్రాంతాల్లో డ్రోన్ల ప్రయాణ దూరాన్ని విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నాం.

ఈ కొత్త విధానానికి సంబంధించిన నిబంధనలను 2019, జనవరి 15న భారత్‌లోని ముంబైలో జరిగే ప్రపంచ విమానయాన సదస్సులో విడుదల చేస్తాం. అంతేకాకుండా కొత్త డ్రోన్‌ విధానంలో భాగంగాసరుకుల రవాణాకు  ఒకే ఆపరేటర్‌ బహుళ డ్రోన్లను వినియోగించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది’’ అని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో భారత్‌ తొలి డ్రోన్‌ విధానాన్ని, నియమనిబంధనల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు స్పందిస్తూ..‘సహాయక చర్యలు, ఏరియల్‌ సర్వే, పంటల అంచనా, సరుకుల చేరవేత తదితర రంగాల్లో డ్రోన్ల సేవలను గణనీయంగా వాడుకోవచ్చు. వీటి వినియోగానికి డిజిటల్‌ ‘కీ’ని జారీచేస్తాం. ఓటీపీ ద్వారా రిజస్టర్‌ అయ్యాక మాత్రమే డ్రోన్లు టేకాఫ్‌ కాగలవు’ అని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు