ఛేజ్ చేసి బుల్లెట్‌ను ఢీకొట్టడంతో..!

21 Sep, 2017 08:57 IST|Sakshi
తప్పతాగిన లాయర్.. ఛేజ్ చేసి మరీ..!

సాక్షి, న్యూఢిల్లీ : పబ్లిక్‌లో స్మోకింగ్ చేయవద్దని చెప్పిన కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తప్పతాగిన లాయర్ విద్యార్థిపై నుంచి కారు తీసుకెళ్లడంతో దాదాపు నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. ఈ దారుణం న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పంజాబ్‌లోని భాటిండాకు చెందిన గుర్‌ప్రీత్ సింగ్(21) ఉత్తర ఢిల్లీలోని ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో కోర్సు చేస్తున్నాడు. మనిందర్ సింగ్ అనే స్నేహితుడితో స్థానిక షాహ్‌బాద్ డైరీలో ఉంటున్నాడు. డాక్యుమెంటరీ పనుల్లో భాగంగా గుర్‌ప్రీత్, మనిందర్ ఆదివారం వేకువజామున 3:30గంటలకు బైక్‌పై దక్షిణఢిల్లీలోని ఏయిమ్స్ కాలేజీకి వెళ్లారు.

కొంత సమయం తర్వాత అక్కడినుంచి బయటకు వస్తుండగా తప్పతాగిన ఓ వ్యక్తి రోహిత్ కృష్ణా మహంతా వీరిని అడ్డుకున్నాడని మనీందర్ తెలిపాడు. సిగరెట్ తాగుతూ అదేపనిగా తమ ముఖాలపైకి పొగ వదులుతున్నాడు. పబ్లిక్ ప్లేస్‌లో స్మోకింగ్ చేయడం తప్పవని చెప్పిన మమ్మల్ని అసభ్యంగా దూషించడంతో పాటు చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్కడ ఉండటం మంచిదికాదని విద్యార్థులు తమ బుల్లెట్ బైక్‌పై అక్కడినుంచి పోయారు. అసలే తాగిన మైకంలో ఉన్న రోహిత్ కృష్ణా తనకే నీతివాక్యాలు చెబుతారా అంటూ కోపం పెంచుకుని తన ఫోర్డ్ ఫిస్టా కారులో విద్యార్థులను ఛేజ్ చేశాడు. ఈ క్రమంలో ఓ ఆటో, ఓలా క్యాబ్‌ను ఢీకొట్టిన ఆ లాయర్ అనంతరం ఏయిమ్స్ సెంటర్ సమీపంలో గుర్‌ప్రీత్, మనీందర్ వెళ్తున్న బుల్లెట్‌ను ఢీకొట్టాడు.

కిందపడ్డ గుర్‌ప్రీత్ పై నుంచి కారు తీసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డ అతడ్ని మనీందర్ హాస్పత్రికి తీసుకెళ్లాడు. ఆదివారం నుంచి మృత్యువుతో పోరాడుతున్న గుర్‌ప్రీత్ బుధవారం మృతిచెందాడని చెబుతూ మనీందర్ కన్నీటి పర్యంతమయ్యాడు. యాక్సిడెంట్ చేసిన రోహిత్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే నిన్న గుర్‌ప్రీత్ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు హత్యకేసు, డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులు నమోదుచేశారు. లాయర్ రోహిత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

>
మరిన్ని వార్తలు