మద్యం..మగువ..వయాగ్రా..ఓ డీఎస్పీ!

7 Feb, 2020 15:28 IST|Sakshi

శ్రీనగర్‌ : హిజ్బుల్‌ ముజహిదీన్‌ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పోలీసుల రిమాండ్‌లో ఉన్న జమ్ము కశ్మీర్‌ డీఎస్పీ దవీందర్‌ సింగ్‌ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దవీందర్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసిన క్రమంలో వారం పాటు ఉత్తర, దక్షిణ కశ్మీర్‌లో జరిగిన దాడుల్లో లభ్యమైన ఆధారాలు, రికార్డులు, సీజ్‌ చేసిన మెటీరియల్‌ ద్వారా సింగ్‌ నిర్వాకాలు దిగ్భ్రాంతిగొలిపేలా బయటపడ్డాయి. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా డీఎస్పీ దవీందర్‌ సింగ్‌ ఎవరిమాటా వినే రకం కాదని, ఆయన ఏ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీకి పనిచేయకుండా ఇష్టానుసారం వ్యవహరించేవాడని తెలిసింది. సింగ్‌ ఫోన్‌ మెసేజ్‌లు, సాగించిన సంభాషణలను స్కాన్‌ చేసిన మీదట ఆయన భిన్నమైన లైఫ్‌స్టైల్‌ను కలిగి ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

నిత్యం మద్యం సేవించడంతో పాటు దాదాపు పన్నెండు మంది మహిళలతో ఆయనకు సంబంధాలున్నట్టు ఎన్‌ఐఏ వర్గాలు చెబుతున్నాయి. మహిళలతో ఎఫైర్లు నడపటంపై సింగ్‌ విచ్చలవిడిగా ఖర్చు చేస్తారని లైంగిక సంబంధాలకు బానిసగా మారిన ఆయన నిత్యం వయాగ్రాను వాడతారని ఓ ప్రైవేట్‌ టీవీ చానెల్‌తో ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. అరెస్ట్‌ అయిన నాలుగు వారాల తర్వాత దవీందర్‌ సింగ్‌ పీలగా, వయసుమీరిన వ్యక్తిగా కనిపిస్తున్నాడని ఆ వర్గాలు తెలిపాయి. తన ఖరీదైన అలవాట్లను కొనసాగించేందుకు ఆయనకు డబ్బు అవసరం విపరీతంగా పెరిగిందని, తన లైఫ్‌స్టైల్‌ను మెయింటెయిన్‌ చేసేందుకు భారీ మొత్తాలు అవసరమయ్యాయని పేర్కొన్నాయి. ప్లేబాయ్‌ లైఫ్‌స్టైల్‌తో పాటు శ్రీనగర్‌ ఇంద్రానగర్‌లో తాను నిర్మించే విలాసవంతమైన భవంతికి నిధుల కొరత ఏర్పడిందని, బంగ్లాదేశ్‌లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న ఇద్దరు కుమార్తెలకు ఫీజు చెల్లించాల్సి వచ్చిందని విశ్లేషించాయి.

శ్రీనగర్‌లోని ప్రముఖ స్కూల్‌లో ఆయన కుమారుడు చదువుతున్నాడని, మిలిటెంట్లు, ఆయుధాలతో ఆయన రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడేవరకూ ఖర్చులను బాగానే నిర్వహించారని ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. నాలుగు దశాబ్ధాలుగా తాను చేసిన సేవలు ఈ ఆరోపణలతో నీరుగారిపోయాయని విచారణ సందర్భంగా సింగ్‌ వాపోయారని చెప్పాయి. తాను చేసిన పనులపై ఇప్పుడు ఆయనలో పశ్చాత్తాపం కనిపిస్తోందని, దర్యాప్తులో పలుమార్లు ఆయన కంటనీరు పెట్టుకున్నారని తెలిపాయి. హిజ్బుల్‌ కమాండర్‌ నవీద్‌ బాబు, అతడి ఇద్దరు అనుచరులకు సింగ్‌ సాయం చేశారని ఇంతకు మినహా దేశ వ్యతిరేక కార్యకలాపాలతో ఆయనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఎన్‌ఐఏ ఇంకా ఏమీ గుర్తించలేదని ఆ వర్గాలు వెల్లడించాయి.

చదవండి : ఉగ్రవాదులకు పోలీసు సాయం..

మరిన్ని వార్తలు