కదులుతున్న బస్సులోంచి దూకిన యువతి

1 Oct, 2018 10:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ఆకతాయిల వేధింపులు తాళలేక దక్షిణ ఢిల్లీలో ఓ యువతి కదులుతున్న బస్సులో నుంచి కిందకు దూకేసింది. ఈ విషయం బాధితురాలు సోదరి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వెలుగులోకి వచ్చింది. రోజు రూట్‌ నంబర్‌ 544 ప్రయాణించే తన సోదరిని అకతాయిలు గడిచిన మూడు నెలల కాలంలో ఏడుసార్లు వేధించినట్టు కూడా ఆమె ఆరోపించారు. శనివారం ఈ వేధింపులు మరి ఎక్కువ కావడంతో తన సోదరి అలా చేసిందన్నారు.

‘నా సోదరి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోంది. తను ప్రయాణించే రూట్‌లో అల్లరిమూకలు అదేపనిగా యువతులపై వేధింపులకు పాల్పడుతున్నారు. గతంలో తనను కొందరు వ్యక్తులు వేధిస్తే ఈ విషయాన్ని బయటకు చెప్పడంతో బస్సులోని అందరు కలిసి అతన్ని కిందకి దించేశారు. కానీ ఆ మరుసటి రోజే ఆ వ్యక్తి మళ్లీ అదే బస్సులో కనబడటం తనలో భయాన్ని పెంచింది. దీంతో తను కొన్ని రోజులు వేరే మార్గాల్లో కళాశాలకు వెళ్లింది. కానీ ఆ రూట్‌లలో ప్రయాణించడం వల్ల తను కాలేజీకి అలస్యంగా చేరుకునేది.. దీంతో తిరిగి ఇదే మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఢిల్లీలోని చాలా మంది విద్యార్థులు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తారు. దీనిని అదనుగా చేసుకునే ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. శనివారం ఆకతాయిలు తనను లక్ష్యంగా చేసుకుని నీ గురించి మాకు మొత్తం తెలుసు.. నువ్వు చదువుతున్నది ఎక్కడో కూడా మాకు తెలుసు అంటూ వేధించసాగారు. దీంతో భయాందోళనకు గురై కదులుతున్న బస్సులో నుంచి తను కిందకు దూకేసింద’ని బాధితురాలి సోదరి ట్విటర్‌లో తన ఆవేదనను పంచుకున్నారు. 

ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో.. డీసీపీ విజయ్‌ కుమార్‌ దీనిపై స్పందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియజేస్తే తాము చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్న మార్గాలో మఫ్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేసి.. యువతులకు భద్రత కల్పిస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు