ఆ వీడియోలో ఉన్నది నేను కాదు: కోమల్‌

15 Jan, 2020 14:24 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనతో తనకు సంబంధం లేదని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని కోమల్‌ శర్మ పేర్కొన్నారు. దాడికి సంబంధించిన వీడియోలో కనిపించింది తాను కాదంటూ జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. జనవరి 5న జేఎన్‌యూలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో పాటు మరో 37 మందిని అనుమానితులుగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీసీటీవీ పుటేజీలు, వాట్సప్‌లో వైరల్‌ అవుతున్న వీడియోల ఆధారంగా మరికొంతమందిని పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా.. ముసుగులు ధరించి హాస్టల్‌లో దాడికి పాల్పడిన ఓ యువతిని.. ఢిల్లీ యునివర్సిటీకి చెందిన విద్యార్థిని కోమల్‌ శర్మగా పోలీసులు ధృవీకరించారు. ఇందుకు సంబంధించిన వార్తలు, సదరు విద్యార్థిని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.(జేఎన్‌యూ హింస: ముసుగు ధరించింది ఆమేనా!?)

ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన కోమల్‌ మాట్లాడుతూ.. ‘ ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. నన్ను కావాలనే అందులో ఇరికించారు. దురుద్దేశంతో.. నన్ను చెడుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా పరిస్థితి అధ్వానంగా తయారైంది. బంధువులు, స్నేహితుల నుంచి అధిక సంఖ్యలో ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఆ వీడియోలో మాస్క్‌ ధరించి ఉన్నది నేనే అని.. నా గురించి చెడుగా అనుకుంటున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జేఎన్‌యూ ఘటనపై ఓ జాతీయ మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఏబీవీపీకి చెందిన విద్యార్థులే దాడి చేసినట్టు వెల్లడయిన విషయం తెలిసిందే. అక్షత్‌ ఆవాస్థీ అనే విద్యార్థి మాట్లాడుతూ.. ఆరోజు రాత్రి జరిగిన ఘటనకు నాయకత్వం వహించింది తానేనని వీడియో ముందు ఒప్పుకున్నాడు. అంతేకాదు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై ప్రతీకారం తీర్చుకునేందుకు హాస్టల్‌ బయట నుంచి కొంతమంది వ్యక్తులను లోపలికి తీసుకెళ్లి ఈ దాడికి పాల్పడ్డటు కూడా అంగీకరించాడు. ఆయితే అవాస్థీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఏబీవీపీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా